Ad Code

బైక్ బహుమతిగా ఇచ్చిన నెటిజన్లు


కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా టీచర్  ఉద్యోగం కోల్పోయాడు. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా మారాడు. ఫుడ్ డెలివరీ చేయడానికి అతని దగ్గర బైక్ లేదు. సైకిల్ మీదే ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కానీ ఒకే ఒక్క పోస్ట్ అతని జీవితాన్ని మార్చేసింది. కేవలం 24 గంటల్లో అతని స్టోరీ పాపులర్ అయింది. ఇందుకు కారణం ఆదిత్య శర్మ. అతనో ఆంట్రప్రెన్యూర్. వెబ్‌3, ఎన్ఎఫ్‌టీ నిపుణుడు. ఓరోజు ఓ వ్యక్తి సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న దృశ్యం చూశాడు. 42 డిగ్రీల ఎండలో కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్న తీరు అతడిని కలిచివేసింది. వెంటనే వివరాలు సేకరించాడు. ఆ డెలివరీ ఏజెంట్ పరు దుర్గా మీనా అని తెలిసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టీచింగ్ జాబ్ పోయిందని, నాలుగు నెలలుగా ఫుడ్ డెలివరీ చేస్తున్నానని, సైకిల్ పైనే ఫుడ్ డెలివరీ చేస్తున్నానని చెప్పడంతో ఆదిత్య శర్మ అవాక్కయ్యాడు. ఈ వివరాలన్నీ ఇంగ్లీష్‌లోనే చెప్పడంతో ఖంగుతిన్నాడు. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా మారిన టీచర్ దుర్గా మీనా పరిస్థితిని వివరిస్తూ ట్విట్టర్‌లో ఓ త్రెడ్ పోస్ట్ చేశాడు ఆదిత్య శర్మ. ఆదిత్య శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం దుర్గా మీనా వయస్సు 31 ఏళ్లు. బీకామ్ పాసయ్యాడు. 12ఏళ్ల పాటు టీచింగ్ వృత్తిలోనే ఉన్నాడు. ఎంకామ్ చదవాలనుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. ఉద్యోగం కూడా పోవడంతో జొమాటో డెలివరీ ఏజెంట్‌గా మారాడు. ఆర్డర్స్ డెలివరీ చేస్తూ నెలకు రూ.10,000 సంపాదిస్తున్నాడు ఓ బైక్ కొనడానికి దుర్గా మీనా కొంత పొదుపు చేస్తున్నాడని ఆదిత్య శర్మకు తెలిసింది. దీంతో ఆదిత్య శర్మ ట్విట్టర్‌లో ఫండ్‌రైజింగ్ ప్రారంభించాడు. బైక్ కోసం రూ.75,000 కావాలని, ఎవరైనా ఫండ్స్ ఇవ్వొచ్చని కోరాడు. కేవలం 24 గంటల లోపే మొత్తం ఫండ్స్ వచ్చేశాయి. రాజస్తాన్‌లోని భిల్వారాలో హీరో స్ప్లెండర్ బైక్ కొని దుర్గా మీనాకు ఇచ్చాడు. ఆదిత్య శర్మ చేసిన ప్రయత్నంపై ట్విట్టర్‌లో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Post a Comment

0 Comments

Close Menu