Ad Code

డాక్టర్ల కోసం సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాంచ్ !


ప్రముఖ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన మ్యాన్‌కైండ్ ఫార్మా తాజాగా ఓటీటీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కంపెనీ డాక్టర్ల కోసం ప్రత్యేకంగా డాక్‌ఫ్లిక్స్‌ అనే సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. డాక్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో రకరకాల సబ్జెక్టులపై 20 డిఫరెంట్ షోలు ఉంటాయి. ఇందులో సైన్స్ సింప్లిఫైడ్, లెజెండ్ ఇన్‌సైడ్ ద వైట్ కోట్, స్టిచ్ ఇన్ టైమ్, కార్డియో అన్‌ఫ్లిప్, డిజిటల్ ఫర్ డాక్టర్స్, మెడికో లీగల్ కేసెస్ ఇన్ ఇండియా, వాన్టేజ్ పాయింట్ వంటి షోలు ఉన్నాయి. స్ట్రీమింగ్ మేజర్ నెట్‌ఫ్లిక్స్‌ లాగా డాక్‌ఫ్లిక్స్‌లో చాలా వీడియో కంటెంట్ ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశంలోని వైద్యుల వివిధ అభ్యాస అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సైంటిఫిక్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. "ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విభిన్న విషయాలపై 20 విభిన్న ప్రదర్శనలు ఉంటాయి" అని మ్యాన్‌కైండ్ ఫార్మా పేర్కొంది. వైద్యులు రూపొందించిన సైంటిఫిక్ కంటెంట్‌ను చిన్న వీడియో ఫార్మాట్‌లలో అందించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. "రొటీన్ కంటెంట్‌ని అందించడానికి డాక్టర్లకు అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే మారుతున్న కాలాలకు అనుగుణంగా కంటెంట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కంటెంట్ తీసుకురాలేక పోతున్నాయి. అలాగే వైద్యులు, రోగుల నిష్పత్తిలో ఉన్న భారీ అంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన దేశంలో వైద్యులకు చాలా పరిమిత సమయం ఉంది. ఈ పరిమిత సమయంలో క్వాలిటీ కంటెంట్ అందించేందుకే డాక్‌ఫ్లిక్స్ తీసుకొచ్చాం" అని మ్యాన్‌కైండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. "డిజిటల్ హెచ్‌సీపీ ఎంగేజ్‌మెంట్ స్పేస్‌లో మా డాక్‌ఫ్లిక్స్‌ లాంచ్‌ను ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. డిజైన్, కథనం, సౌలభ్యం అనేవి ఈ ప్లాట్‌ఫామ్ మూడు బలమైన స్తంభాలు. ఇవి ప్రత్యేకమైన, ప్రామాణికమైన, విశ్వసనీయమైన సైంటిఫిక్ కంటెంట్‌ను అందజేస్తాయి." అని మ్యాన్‌కైండ్ ఫార్మా సీనియర్ ప్రెసిడెంట్ ఇండియా బిజినెస్, డాక్టర్ సంజయ్ కౌల్ లాంచ్ సందర్భంగా చెప్పారు. నిపుణులైన వైద్యుల బృందం ద్వారా సైంటిఫిక్ కంటెంట్‌ను రూపొందించడంతో పాటు, మెడికల్ డేటా, ఫిగర్‌లను ఉత్తమంగా రిప్రజెంట్ చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో పాసైన బృందాన్ని కూడా మ్యాన్‌కైండ్ ఫార్మా నియమించుకుంది. సైన్స్‌ను సరదా కథగా మార్చగల దర్శకులు, స్క్రిప్ట్ రైటర్లను కూడా తీసుకుంది. ఇప్పటికే గుండె జబ్బులు నయం చేసే ప్రముఖ డాక్టర్లు నమ్మదగిన, ప్రామాణికమైన కంటెంట్‌ను రూపొందించడానికి తమతో పార్ట్‌నర్‌షిప్ పెట్టుకున్నారని కంపెనీ వెల్లడించింది. ఈ కంటెంట్‌ వైద్యులకు వేగంగా వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని, తద్వారా దేశంలో గుండెజబ్బుల మరణాల రేటు తగ్గించడం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. "సాంకేతికత పరంగా, ప్లాట్‌ఫామ్‌పై ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఏఐ-ఎనేబుల్డ్ ఇంటర్‌ఫేస్‌ను మా టీమ్‌ రూపొందిస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు కంటెంట్‌ని వినియోగించుకునే సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి" అని మ్యాన్‌కైండ్ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu