ట్విటర్ బోర్డు నుంచి వైదొలగిన జాక్ డోర్సీ


ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఆ సంస్థ బోర్డు నుంచి వైదొలగారు. దీంతో ఆయన మళ్ళీ ట్విటర్ సీఈఓగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలకు తెరపడింది. ఆయన ప్రస్తుతం ఫైనాన్షియల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం బ్లాక్ కు నేతృత్వం వహిస్తున్నారు. 2021 నవంబరులో ట్విటర్  సీఈఓ పదవికి డోర్సీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా వెనుక కారణాలేమిటో ఆయన వివరించలేదు. అయితే ఆయన సృజనాత్మకంగా ఆలోచించలేకపోతున్నారని, శ్రద్ధ కొరవడిందని ఆరోపిస్తూ సీఈఓ పదవికి వేరొకరిని ఎంపిక చేయాలని బోర్డు 2020 నుంచి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కొందరు చెప్తున్నారు. ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన ట్విటర్ బోర్డు నుంచి వైదొలగే అవకాశాలు ఉన్నాయని అందరికీ అర్థమైంది. అప్పట్లో ఆ కంపెనీ వివరణ ఇస్తూ, 2022 స్టాక్‌హోల్డర్స్ మీటింగ్ వరకు ఆయన బోర్డులో కొనసాగుతారని తెలిపింది. డోర్సీ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత సీటీఓ పరాగ్ అగర్వాల్‌ ఆ పదవిలో నియమితులయ్యారు. డోర్సీ రాజీనామా చేస్తూ ట్విటర్ ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్‌లో అగర్వాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ట్విటర్‌ టేకోవర్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ట్విటర్ యూజర్లలో 5 శాతం కన్నా తక్కువ మాత్రమే ఫేక్, స్పామ్ అకౌంట్లు ఉన్నట్లు రుజువయ్యే వరకు ఈ డీల్‌ను నిలిపేస్తానని మస్క్ మే 17న ప్రకటించారు.


Post a Comment

0 Comments