Ad Code

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్‌లో పరిమితులు ?


ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఉన్న ఫీచర్లను మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా స్టోరీస్ ఫీచర్‌లో ఒక కొత్త లేఅవుట్‌ ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు ఇన్‌స్టా స్టోరీస్‌లో తమ జీవితంలో జరిగే ప్రతిదీ షేర్ చేసుకోలేరు. ఎందుకంటే కొత్త లేఅవుట్‌ కేవలం 3 స్టోరీలు మాత్రమే ఫాలోవర్లకు చూపిస్తుంది. స్టోరీస్‌ లిమిట్ మార్చాలని ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నట్లు ప్రముఖ టెక్ నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ బ్రెజిల్‌లో స్టోరీస్‌ కోసం కొత్త లేఅవుట్‌ను పరీక్షిస్తోంది. ఈ లేఅవుట్‌ ఒకేసారి మూడు స్టోరీస్‌ మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది. మిగిలిన వాటిని దాచిపెడుతుంది. ఈ అప్‌కమింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్‌ను చూసిన టెక్ నిపుణులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యాప్ ఒకేసారి మూడు స్టోరీలను మాత్రమే చూపుతుందని, మిగిలిన వాటిని "షో ఆల్ " బటన్ వెనుక దాచిపెడుతుందని వివరించారు. ఆసక్తి ఉన్న వారు షో ఆల్ బటన్‌పై నొక్కి తాము ఫాలో అయ్యే వారు షేర్ చేసిన అన్ని స్టోరీలను చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఈ లేఅవుట్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తే... క్రియేటర్లకు వారి స్టోరీస్ కోసం ఫాలోవర్లు చూడగలిగే ఉత్తమమైన మూడు పోస్టులు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఫాలోవర్లు అనవసరమైన స్టోరీస్ కాకుండా కేవలం బెస్ట్ స్టోరీస్ మాత్రమే చూడగలుగుతారు. ఫలితంగా సమయంతో పాటు స్టోరీలు స్కిప్ చేయాల్సిన శ్రమ తగ్గుతుంది. నిజానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో లెక్కలేనన్ని స్టోరీలను షేర్ చేస్తుంటారు. అయితే ఈ వరుస స్టోరీలను చూసేందుకు స్టోరీస్ పై క్లిక్ చేయడానికి కూడా ఫాలోవర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో స్టోరీస్‌ ఫీచర్‌కి అర్థమే లేకుండా పోతోంది. అందుకే ఈ ఫొటో షేరింగ్ యాప్... స్టోరీస్‌ ఫీచర్‌లో మార్పు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ప్లాట్‌ఫామ్‌లో స్పామ్ కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కూడా కొత్త మార్పు సహాయపడుతుంది. ప్రస్తుతం, ఇన్‌స్టా యూజర్లు వరుసగా 100 స్టోరీలను పోస్ట్ చేయవచ్చు. అందుకే చాలామంది పదుల కొద్దీ స్టోరీలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయగలుగుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ప్రతి ఫొటో లేదా వీడియోను చూడాలనుకుంటే, క్లిక్ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ లిమిట్‌ను మార్చడానికి ప్లాన్ చేస్తుందో లేదో తెలియదు. కానీ యూజర్లు తాము చేసే ప్రతి పనిని స్టోరీగా పోస్ట్ చేయడాన్ని కంపెనీ ఆపేయాలనుకుంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu