అత్తరు పరిమళాలు
పర్‌ఫ్యూమ్ యాడ్స్‌లో మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వారికోసమే తయారుచేసినట్టు ఉంటాయా ఉత్పత్తులు. కానీ మగువల కోసమే ప్రత్యేకించి ఓ పర్‌ఫ్యూమ్ రేంజ్‌ను తీసుకొచ్చింది ప్రముఖ పరిమళాల తయారీ సంస్థ యునైటెడ్ కలర్స్ బెనెటన్. 'సిస్టర్‌లాండ్ (Sisterland)' పేరుతో విడుదలైన ఈ పర్‌ఫ్యూమ్‌లు పింక్ రాస్‌బెర్రీ, గ్రీన్ జాస్మిన్, రెడ్ రోజెస్.. అనే మూడు పరిమళాల్లో అందుబాటులో ఉన్నాయి. మగువ ఆకారంలోని ప్యాకింగ్ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ఆన్‌లైన్ ధర రూ. 2,100 (80 మి.లీ).
ఇండోర్ బైక్
శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఇంటా, బయటా ఎక్కడైనా తేలిగ్గా చేసుకోదగిన వ్యాయామం సైక్లింగ్. వ్యాయామప్రియుల కోసం రకరకాల సైకిళ్లు, బైక్‌లు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరిన్ని ఫీచర్స్‌తో టెక్నోజిమ్ సంస్థ ఓ సరికొత్త ఇండోర్ బైక్‌ను రూపొందించింది. గేర్లతో అచ్చంగా రోడ్‌మీద వెళ్తున్న ఫీలింగ్ కలిగించే ఈ బైక్ అరక్షణంలో జీరో వాట్స్‌నుంచి వెయ్యి వాట్ల శక్తిని అందుకుంటుంది. టెక్నోజిమ్ యాప్ ద్వారా ఈ బైక్‌ను ఫోన్‌కు అనుసంధానించుకుని స్మార్ట్ స్క్రీన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైక్లింగ్ పాత్‌లను చూస్తూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేయవచ్చు. దీని ఆన్‌లైన్ ధర రూ. 3,99,000.
నోస్టాల్జియా
రేడియో ఒక అద్భుతం. కంటికి కనపడని మనుషుల కమ్మని మాటలు, వినసొంపైన పాటలు ఆనందంతోపాటు ఆహ్లాదాన్నీ అందిస్తాయి. టెక్నాలజీ పెరిగిపోయి టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు.. వంటి వస్తువులు కోకొల్లలుగా పుట్టుకురావడంతో రేడియో కొంత కనుమరుగైపోయింది. అలనాటి జ్ఞాపకాలను తిరిగి అందించేలా సరికొత్త ఫీచర్స్‌తో నేటితరం రేడియోను తీసుకొచ్చింది నాయిజీ బాక్స్ సంస్థ. రెట్రో డబుల్‌ఎక్సెల్ పేరుతో వచ్చిన ఈ పరికరం.. అచ్చంగా మన పల్లెలో, మన తాతయ్య-అమ్మమ్మల ఇంట్లో రేడియోను గుర్తుకు తెస్తుంది. కానీ, ఫీచర్స్ మాత్రం ఆధునికమైనవి. బ్లూటూత్ కనెక్టివిటీ, రిమోట్ కంట్రోల్‌తో వచ్చే ఈ రేడియోలో నచ్చిన పాటలు వినేందుకు యూఎస్‌బీ ద్వారా ఫోన్, మెమరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వింటేజ్ లుక్ రేడియో ఆన్‌లైన్ ధర రూ. 3,999.