Ad Code

త్వరలో మెటా అవతార్ స్టోర్స్‌ ?


మెటా సంస్థ త్వరలోనే "మెటా అవతార్ స్టోర్స్‌"ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. మనరూపంలో ఉన్న ఓ మెటావర్స్ అవతార్‌ను క్రియేట్ చేసుకుని మనకు ఏ ఫ్యాషన్ నప్పుతుందో చూసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మెటా అవతార్ స్టోర్స్ డిజిటల్ డిజైనర్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్యాషన్‌ పార్టనర్‌షిప్స్ వైస్‌ ప్రెసిడెంట్ ఎవా చెన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఉన్న సమయంలో ఈ విషయం ప్రస్తావించారు జుకర్‌బర్గ్. ఫ్యాషన్ విషయంలో యువత ఏం కోరుకుంటోందో అదే వాళ్లకు చేరువ చేయాలని, ఈ మెటా అవతార్ స్టోర్స్‌ ద్వారా వాళ్లకు నచ్చిన ఔట్‌ఫిట్‌లను సెలెక్ట్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. మెటావర్స్‌లో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని అంటున్నారు జుకర్ బర్గ్. క్రియేటివ్ ఎకానమీని పెంచుకునేందుకు ఇలాంటి ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వర్చువల్ స్టోర్ వచ్చే వారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతానికి అమెరికా, కెనడా, మెక్సికో, థాయ్‌లాండ్‌లోనే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు జుకర్ బర్గ్. బాలెన్సిగా, ప్రాడా, థామ్ బ్రోన్ లాంటి బ్రాండ్స్‌ దుస్తుల్ని వర్చువల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అవి వేసుకుంటే మనం ఎలా కనిపిస్తామో, ముందుగానే ఈ స్టోర్‌లో మన అవతార్‌కు సెట్ చేసి చెక్ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో మరికొన్ని బ్రాండ్స్‌ని ఈ స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. ఈ అవతార్‌ స్టోర్‌లో తాను ఎలా కనిపిస్తున్నాడో చెప్పేందుకు కొన్ని లుక్స్‌నీ విడుదల చేశాడు. వోగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం...ఈ అవతార్‌ స్టోర్‌లోని దుస్తులు 2.99 నుంచి 8.99డాలర్ల రేంజ్‌లో ఉంటాయి. ఈ స్టోర్ ద్వారా తమ బ్రాండ్స్‌ని మరింత సులువుగా ప్రమోట్ చేసుకునేందుకు వీలవుతుందని అంటున్నారు ఆయా బ్రాండ్స్ ఓనర్స్. ఫ్యాషన్ ప్రపంచంలో ఇదో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని చెబుతున్నారు. ఈ బ్రాండెడ్ దుస్తులతో పాటు ఉచితంగా మరికొన్ని దుస్తులు అందుబాటులో ఉంచుతారు. భవిష్యత్‌లో ఈ వేదిక ద్వారానే దుస్తుల క్రయవిక్రయాలు జరిగేలా చూస్తామని వెల్లడించారు జుకర్ బర్గ్. ఎన్నో రోజులుగా మెటా ఈ పనిలోనే ఉంది. డిజిటల్ అవతార్‌ను క్రియేట్ చేసి యూజర్స్‌కి కొత్త అనుభవం ఇచ్చేందుకు జుకర్ బర్గ్ బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాదే 3D అవతార్స్‌ని పరిచయం చేశారు. రకరకాల ఎక్స్‌ప్రెషన్లు, స్కిన్‌టోన్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. యూజర్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావటం వల్ల మెటావర్స్‌ ప్రపంచాన్ని విస్తృతం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu