Ad Code

ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి


ఆంధ్రప్రదేశ్ లోని కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి శాస్త్ర, సాంకేతిక రంగంలో అత్యుత్తమ పరిశోధనలు చేసినందుకుగాను ఏడీ సైంటిఫిక్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ పరిశోధకుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఏ) లో భౌతికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన సాధించిన విజయానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ రవీంద్రనాథ్, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఏజీ సైంటిఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌ ప్రకారం డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి అంతర్జాతీయంగా 19,034వ ర్యాంక్, ఆసియా స్థాయిలో 4,302, జాతీయ స్థాయిలో 972 వ, కళాశాలల వారీగా మొదటి స్థానంలో నిలిచారు. ఎస్‌సీఐ పరిశోధన పత్రాలు, స్కోపస్ హెచ్‌-ఇండెక్స్, ఐ-10 సూచిక, సిటేషన్స్‌, ఓఆర్‌సీఐడీ, వెబ్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, గూగుల్‌ స్కాలర్ డాటా బేస్ ఆధారంగా ర్యాంకింగ్‌లు నిర్ణయిస్తారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి.. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ నుంచి 1992 లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివారు. 2005 లో ఎంఫిల్‌, 2008 లో పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. సాలిడ్ స్టేట్ స్పెక్ట్రోస్కోపీ అండ్‌ మెటీరియల్ సైన్స్‌పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు. అతను 25 సంవత్సరాల కంటే ఎక్కువ బోధనా అనుభవం, 15 సంవత్సరాల పరిశోధన అనుభవం కలిగి ఉన్నారు. ఎస్వీ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా ఐదేండ్లపాటు పనిచేశారు. 2008 లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2017 లో ఎన్‌ఈఎస్‌ఏ నుంచి ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. 2005 లో ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ఫెలోగా గుర్తింపు పొందారు. దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్‌లాండ్, హాంకాంగ్, దక్షిణాఫ్రికాలో విజిటింగ్ సైంటిస్ట్‌గా పనిచేశారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు.

Post a Comment

0 Comments

Close Menu