Ad Code

ఏసీకి ప్రత్యామ్నాయం ?


ఏసీలు వాడటం వాల్ల వచ్చే కరెంటు బిల్లులు  చెమటలు పట్టిస్తాయి. వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులూ ఎక్కువగానే వుంటాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా తాజాగా ఐఐటీ గువాహటి  పరిశోధకులు ఒక ఏసీ ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు. ఈ ఏసీ ఆల్టర్నేటివ్ సరసమైనది, సమర్థవంతమైనది మాత్రమే కాకుండా విద్యుత్ లేకుండా కూడా పనిచేస్తుంది. అంటే ఎన్ని కరెంటు కోతలు ఉన్నా చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. ఐఐటీ రిసెర్చర్లు సంప్రదాయ ఎయిర్ కండీషనర్లకు ప్రత్యామ్నాయంగా రేడియేటివ్ కూలర్ కోటింగ్ మెటీరియల్‌ను డిజైన్ చేశారు. ఈ పూతను ఇంటి పైకప్పులపై పూయడం ద్వారా పగలు, రాత్రి సమయంలో ఏసీ లాంటి చల్లదనాన్ని పొందవచ్చు. ఈ ఇన్నోవేటివ్ పాసివ్‌ రేడియేటివ్ కూలింగ్ సిస్టమ్స్ చుట్టుపక్కల నుంచి గ్రహించిన వేడిని పరారుణ వికిరణాల రూపంలో బయటకు విడుదల చేయడం ద్వారా పనిచేస్తాయి. ఈ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్స్‌ చల్లని ఔటర్ స్పేస్‌లోకి వెళ్లడానికి ముందు వాతావరణం గుండా ప్రయాణిస్తాయని ఐఐటీ పరిశోధకులు వివరించారు. అయితే చాలా పాసివ్‌ రేడియేటివ్ కూలర్లు రాత్రిపూట మాత్రమే పని చేయగలవు. పగటిపూట కూడా పని చేయాలంటే ఈ కూలర్లు మొత్తం సోలార్ రేడియేషన్లను ప్రతిబింబించాల్సి  ఉంటుంది. ఇప్పటి వరకు, ఈ పాసివ్‌ రేడియేటివ్ కూలర్లు పగటిపూట తగినంత చల్లదనాన్ని అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఐఐటీ గువాహటి పరిశోధకులు 24 గంటలూ పనిచేయగల సరసమైన, మరింత సమర్థవంతమైన రేడియేటివ్ కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేయడంపై దృష్టిసారిస్తున్నారు. పాలిమర్-ఆధారిత పాసివ్ రేడియేటివ్ కూలర్లను ఉపయోగించి పగటిపూట కూడా చల్లదనాన్ని పొందవచ్చని పరిశోధకులు ఆలోచన చేస్తున్నారు. అయితే ఆక్సీకరణ అనేది పాలిమర్‌లను క్షీణింపజేస్తుంది, ఫలితంగా వీటికి పరిమిత జీవితకాలమే ఉంటుంది. దీనిని పరిష్కరించడానికి, సిలికాన్ డయాక్సైడ్, అల్యూమినియం నైట్రైడ్ సన్నని ఫిల్మ్‌లను ఉపయోగించాలని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే 24 గంటలు పనిచేసే రేడియేటివ్ కూలింగ్ సిస్టమ్‌ థియరిటికల్ డిజైన్‌ ను కఠినమైన కంప్యూటర్-ఆధారిత కృత్రిమవాతావరణ సృష్టికి వ్యతిరేకంగా పరీక్షించి, వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈ రేడియేటివ్ కూలర్ డిజైన్ పెద్ద-ప్రాంతానికి అనుకూలమైనదని.. అందువల్ల, తయారీ ప్రక్రియలో లోపాలకు కూడా తక్కువ అవకాశం ఉందని ఐఐటీ తెలిపింది. ఈ కారణంగా కూలర్‌ డిజైన్ చేశాక లభించే చల్లదనం అంచనాలకు దగ్గరగా ఉండబోతోందని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణతో, కూలర్ తయారీదారులు ఇప్పుడు విద్యుత్ అవసరం లేని కూలింగ్ సిస్టమ్స్‌ను తయారు చేయడానికి రేడియేటివ్ కూలింగ్‌పై ప్రయోగాలు చేయొచ్చు. "వివిధ వాతావరణ పరిస్థితులలో స్థిరత్వం, మన్నిక కోసం పెద్ద స్థాయి ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేసి పరీక్షించాలని.. ఆ తర్వాతే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని బృందం భావిస్తోంది. వారు ఇప్పుడు ఆ దిశగా పనిచేస్తున్నారు" అని ఐఐటీ ఓ అధికారిక నోటీసులో పేర్కొంది. ప్రొఫెసర్ దేబబ్రత సిక్దర్ పర్యవేక్షణలో ఐఐటీ గువాహటిలోని రిసెర్చ్ స్కాలర్ ఆశిష్ కుమార్ చౌదరి.. ఐఐటీ గువాహటిలోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, అతని పరిశోధన బృందం కలిసి ఈ రేడియేటివ్ కూలర్‌ను రూపొందించారు. ఇటీవల ఈ పరిశోధకుల ఆవిష్కరణ కరెంట్ సైన్స్ రిపోర్ట్‌లో ప్రచురితమైంది. అంతకంటే ముందుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని IOP పబ్లిషింగ్ ద్వారా జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ D: అప్లైడ్ ఫిజిక్స్‌లో ప్రచురించడం జరిగింది. మొత్తం సోలార్ స్పెక్ట్రమ్ (0.3-2.5 µm తరంగదైర్ఘ్యాలు)లో... వాతావరణం(8-13 µm తరంగదైర్ఘ్యాలు)లో అధిక రేడియేషన్లను ఏకకాలంలో బయటికి పంపాలంటే చాలా రిఫ్లెక్టింగ్ సామర్థ్యం అవసరమవుతుంది. పగటిపూట ఈ స్థాయిలో ప్రతిబింబించే సామర్థ్యంతో పాసివ్‌ రేడియేటివ్ కూలర్‌ను రూపొందించడం చాలా సవాలుగా ఉందని ఒక పరిశోధకులు వెల్లడించారు. వేడిని పరిసరాల్లోకి పంపే సంప్రదాయ ఏసీ టెక్నాలజీలా కాకుండా, రేడియేటివ్ కూలింగ్ అనేది భూమిపై ఉన్న ఒక వస్తువును చల్లబరుస్తూ.. వేడిని అతి శీతలమైన విశ్వంలోకి నేరుగా పంపిస్తుందని ఆయన వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu