Ad Code

ఇండియా లో ప్లాంట్ మూసేయనున్నఫోర్డ్‌ మోటార్‌ ?


ఇండియన్‌ కార్ల మార్కెట్‌పై పట్టు సాధించాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఆటో దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ ఎంతో కాలంగా ప్రయత్నించింది కానీ విఫలమయ్యింది. దాంతో తన అనుబంధ సంస్థ ఫోర్డ్ ఇండియా భారతదేశంలో ఇకపై కార్లను తయారు చేయడం ఆపేస్తుందని గత ఏడాదిలోనే ప్రకటించింది. అయితే తాజాగా ఈ కంపెనీ తన చివరి కారు ఎకోస్పోర్ట్‌ ను విడుదల చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేసేందుకే చెన్నై ప్లాంట్‌లో తయారు చేసింది. ఫోర్డ్ ఇండియా యూనిట్‌ను అధికారికంగా మూసివేయడానికి ముందు దాని ఎగుమతి హామీలన్నింటినీ నెరవేర్చింది. జనరల్ మోటార్స్, దేవూ తర్వాత ఇండియాలో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేసే మూడో ప్రధాన కార్ల తయారీ సంస్థగా ఫోర్డ్ నిలుస్తుంది. ఫోర్డ్ కంపెనీ గతంలో 2.5 బిలియన్​ డాలర్లతో చెన్నై, గుజరాత్​లోని సానంద్​ లలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్స్ నుంచి ఎకో స్పోర్ట్​, ఫీగో, యాస్పైర్​ వంటి మోడళ్లను తయారు చేసేది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోగా భారీ నష్టాలు వాటిల్లడంతో సెప్టెంబర్ 9, 2021న భారత మార్కెట్లో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తామని ప్రకటించింది. కానీ దిగుమతి చేసిన కార్లను మాత్రం ఇండియాలో విక్రయిస్తామని తెలిపింది. ఇండియన్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన చివరి కారు విడుదల సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ  "B515 ఎక్స్‌పోర్ట్ వెహికల్ ప్రొడక్ట్‌ని పూర్తి చేయడంలో సపోర్ట్ చేసిన ఉద్యోగులందరికీ మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేం ఫోర్డ్ కస్టమర్ సర్వీస్ డివిజన్ విడిభాగాల ఉత్పత్తిని తయారుచేసే పరిమిత ఉద్యోగులను కొనసాగిస్తాం. ఆ తర్వాత కంపెనీ ప్లాంట్ మూసివేతకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటుంది." అని ఆ ప్రతినిధి వెల్లడించారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది. 2012లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయి జూన్ 26, 2013న అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫోర్డ్ రూ.5.59 లక్షల ధరతో మార్కెట్‌లో విడుదలై ఆశ్చర్యపరిచింది. ఫోర్డ్ ఇండియా లైనప్‌లో అత్యధికంగా ఎగుమతి అయిన కార్లలో ఇది ఒకటి. ఫోర్డ్ ఇండియా యూనియన్‌తో యూనిట్ మూసివేతపై చర్చలను పూర్తి చేయడానికి అదనపు సమయాన్ని అందిస్తుంది. ఆగస్టు 31, 2022 వరకు కంపెనీ ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించడాన్ని కొనసాగిస్తుంది. "ఇది యూనియన్, ఉద్యోగుల సపోర్టుకు సంబంధించింది. జులై, ఆగస్టు నెలల్లో సూపర్వైజర్ల అవసరం ఉంది. ఆగస్టు గడువు కంటే ముందే చర్చలను విజయవంతంగా ముగించడంలో యూనియన్ మద్దతు కోసం మేం ఎదురుచూస్తున్నాం" అని ప్రతినిధి తెలిపారు. గత సెప్టెంబరులో ఫోర్డ్ తన చెన్నై ప్లాంట్‌లో భారీ నష్టాలు, స్థిరమైన మార్గాన్ని అన్వేషించలేక జూన్ నాటికి వాహనాల తయారీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మే 30న ఉద్యోగులు మెరుగైన విభజన ప్యాకేజీ (Severance Package)ని కోరుతూ నిరసనలు చేపట్టి ఉత్పత్తిని నిలిపివేశారు. కొంతకాలం తర్వాత ఒక విభాగం ఉద్యోగులు కార్ల తయారీకి సపోర్ట్ చేయడానికి అంగీకరించారు.

Post a Comment

0 Comments

Close Menu