Ad Code

50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ !



ఆకాశంలో తళుక్కుమని మెరిసే నక్షత్రాలను కళ్లకు అందేంత దూరానికి తెచ్చి నిలుపుతోంది టెక్నాలజీ. అటువంటి టెక్నాలజీల ఫలితమే..జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇప్పుడు సుదూర నక్షత్రాల గుట్టు తేల్చేందుకు అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను పంపగలిగే దశకు మనిషి చేరుకున్నాడు. ఇప్పుడా టెలిస్కోప్ కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలోని నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలను మన కళ్లముందు ఉంచుతోంది. ఈ క్రమంలోనే సుదూర అంతరిక్షంలో ఓ అతి పెద్ద 'చక్రం' వంటి గెలక్సీని నాసా శాస్త్రవేత్తల ముందు పెట్టింది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌తో ఆకాశంలో అంగుళం అంగుళాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు..తాజాగా మరో అత్యద్భుతమైన గెలాక్సీని గుర్తించారు నాసా శాస్త్రవేత్తలు. ఆ గెలాక్సీ వెలుగులు విరజిమ్ముతు చక్రం రూపంలో ఉంది. అచ్చంగా విష్టుమూర్తి సుదర్శన చక్రంలాగా ఉంది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ గెలాక్సీకి శాస్త్రవేత్తలు 'కార్ట్ వీల్' అని పేరు పెట్టారు. స్పైరల్ ఆకారంలో ఉండే ఓ పెద్ద గెలాక్సీ, మరో చిన్న గెలాక్సీ రెండూ వేగంగా ప్రయాణిస్తూ.. ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో కలిసిపోయి ఈ 'వీల్ కార్ట్' గెలాక్సీ ఏర్పడి ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిలో మధ్యలో ఒక రింగ్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు..సుదూరంగా మరో రింగ్ లా నక్షత్రాలు, ఖగోళ పదార్థం చేరాయని.. ఆ రెండింటినీ అనుసంధానిస్తూ బండి చక్రం పుల్లల్లా ఖగోళ పదార్థాలు ఏర్పడ్డాయని వివరించారు. దీని బయటి రింగ్‌ లో కోట్ల సంఖ్యలో కొత్త నక్షత్రాలు పుడుతున్నాయని.. అప్పటికే ఉన్న నక్షత్రాలు పేలిపోతూ సూపర్ నోవాలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu