Ad Code

డ్రోన్ కెమెరాకు ఆర్డరిస్తే పొటాటోలు !


ఆర్డర్ ఒకటిస్తే మరోటి డెలివరీ చేసినందుకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ తర్వాత మరో ఈ కామర్స్ ప్లాట్‌పాం మీషో టార్గెట్‌గా మారింది. తాను మీషో వేదికగా డ్రోన్‌కు ఆర్డర్ ఇస్తే ఓ బాక్సులో కిలో బంగాళదుంపలు పంపారని బిహార్‌కు చెందిన వ్యక్తి వెల్లడించారు. ఈ ఘటనను అతడు రికార్డు చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలందలోని పర్వాల్‌పూర్‌కు చెందిన చేతన్‌కుమార్‌కు మీషో సైట్‌పై ఎదురైన అనుభవాన్ని రికార్డు చేశారు. అన్‌సీన్ ఇండియా అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో అందుబాటులో ఉంది. మీషో నుంచి తనకు వచ్చిన ప్యాకేజ్‌పై అనుమానంతో దాన్ని అక్కడే ఓపెన్ చేయాలని డెలివరీ బాయ్‌ను కుమార్ కోరడం ఈ వీడియోలో కనిపించింది. ఆపై బాక్స్‌లో పొటాటోలు ఉండటంతో వారిద్దరూ షాక్ తిన్నారు. డ్రోన్ ఆర్డర్ చేస్తే మీషో పొటాటోలు పంపిందని డెలివరీ బాయ్‌, కుమారతో పాటు అక్కడ గుమికూడిన వారు ఈకామర్స్ సంస్ధ నిర్వాకాన్ని ఎండగట్టారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు చేపడతామని, కస్టమర్‌కు తాము డబ్బు రిఫండ్ చేశామని మీసో వెల్లడించింది. కస్టమర్ విశ్వాసాన్ని ప్రభావితం చేసే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించేది లేదని, దీనిపై తీవ్ర చర్యలు చేపడతామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈకామర్స్ సైట్లలో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు. తాను ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇస్తే ఫ్లిప్‌కార్ట్ తనకు డిటర్జెంట్ సోప్‌లు డెలివరీ చేసిందని ఇటీవల ఓ ఐఐఎం విద్యార్ధి ఆరోపించాడు. ఈ ఘటనతో ఇక నుంచి కస్టమర్లు డెలివరీ ఎగ్జిక్యూటివ్ సమక్షంలోనే బాక్స్‌లను ఓపెన్ చేయాలని ఫ్లిప్‌కార్ట్ సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu