Ad Code

స్మార్ట్‌ఫోన్లలో ఇక GPS ఉండదు?


ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం 'గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(GPS)ను వినియోగిస్తున్నాయి. అయితే భారత్ లో దీని స్థానంలో కొత్తగా దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్‌ సిస్టమ్‌ (NavIC)ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట!. ఈ మేరకు మొబైల్‌ తయారీ కంపెనీలతోనూ సమావేశాలు నిర్వహించిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకు అనుకూలంగా ఫోన్లను తయారు చేయాలని ఆయా కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతమున్న గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టంకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ నావిగేషన్‌ సిస్టమ్‌ను ఇండియా తీసుకొస్తోంది. ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్’ (NavIC) పేరుతో కొత్త నావిగేషన్‌ సిస్టమ్‌ను పరిచయం చేయనుంది. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఈ నావిగేషన్ సిస్టంను అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ఆయా మొబైల్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినట్టు వార్తలొస్తున్నాయి. ఇక మీదట తయారయ్యే ఫోన్లను కొత్తగా తీసుకొస్తున్న నావిగేషన్ సిస్టమ్‌కు అనుకూలంగా మార్చాలని భారత ప్రభుత్వం కోరిందట. NavIC అనేది GPSకి ఇండియన్‌ వెర్షన్. ఈ సాఫ్ట్ వేర్ తయారీ కోసం ఇస్రో, క్వాల్‌కామ్‌ తో కలిసి పని చేసింది. ప్రస్తుతం సైనిక కార్యకలాపాల కోసమే ఈ సిస్టంను ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ లొకేషన్‌ ట్రాకింగ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌, ఫుడ్ డెలివరీ, ట్యాక్సీ బుకింగ్ సర్వీస్‌.. ఇలా అన్ని సర్వీసులను ఈ కొత్త సిస్టంపైనే వర్క్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇస్రో డెవలప్ చేసిన నావిక్ సిస్టం 7 శాటిలైట్స్‌పై ఆధారపడి పని చేస్తుంది. వీటిలో 3 జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్‌ కాగా, మిగిలిన 4 జియోసింక్రోనస్ ఆర్బిట్ శాటిలైట్స్‌ ఉన్నాయి. సొంతంగా నావిగేషన్ సిస్టం ఏర్పాటుచేసుకోవాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. 1990లోనే అందుకు అడుగులు పడ్డాయి. అందుకు కారణం అమెరికా చర్యలే. 1999లో కార్గిల్ యద్ధంలో పాక్ సైనిక దళాలు ఎక్కడ కచ్ఛితంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి భారత సైన్యానికి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది. ఈ క్రమంలో అలాంటి సాంకేతికత అందుబాటులో ఉన్న అమెరికాను భారత్ సాయం కోరింది. కానీ, భారత్ కు సాయం చేయటానికి అమెరికా నిరాకరించింది. దీన్నో గుణపాఠంగా భావించిన ఇస్రో, అప్పటి నుంచి దేశీయంగా రూపొందించే నావిగేషన్ వ్యవస్థ మీద దృష్టి పెట్టింది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలకు పైగా పనిచేశాక.. ప్రయత్నాలు ఫలించి సొంత నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ఏర్పడింది.







Post a Comment

0 Comments

Close Menu