Ad Code

అందుబాటులోకి ఎయిర్‌టెల్ 5జీ సేవలు !


భారతీ ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన పట్టణాలలో5జీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. శనివారం నుంచే ఈ సర్వీసులు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ సేవలు లభించనున్నాయి. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ తెలిపారు. 2024 మార్చి కల్లా దేశం మొత్తం 5జీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎయిర్‌టెల్ కంపెనీ ఎరిక్‌సన్, నోకియా , శాంసంగ్ వంటి సంస్థలతో కలిసి 5జీ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సునీల్ మిట్టల్ కంపెనీ ఎయిర్‌టెల్ 19,867 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఇందులో 900 మెగా హెర్ట్జ్, 1800 మెగా హెర్ట్జ్, 3300 హెగా హెర్ట్జ్, 26 మెగాహెర్ట్జ్ బాండ్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన స్పెక్ట్రమ్ వేలంలో ఎయిర్‌టెల్ రూ. 43 వేల కోట్లకు పైగా చెల్లించింది. 5జీ సేవలు పొందాలని భావించే వారు కచ్చితంగా 5జీ ఫోన్ కలిగి ఉండాలి. అలాగే వారు నివసించే ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని పట్టణాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల మీరు ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండకపోవచ్చు. 5జీ నెట్‌వర్క్ ఉండి, 5జీ ఫోన్ కొనుగోలు చేసిన వారు.. ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ మొబైల్ నెట్‌వర్క్ లేదా కనెక్షన్స్ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు నెట్‌వర్క్ మోడ్‌లోకి వెళ్లాలి. ఇక్కడ 5జీ/4జీ/3జీ/2జీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మీ ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తూ, మీ ఏరియాలో 5జీ నెట్‌వర్క్ ఉంటే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. 4జీ కన్నా 30 రెట్లు స్పీడ్‌తో 5జీ సేవలు లభిస్తాయని ఎయిర్‌టెల్ పేర్కొంటోంది.

Post a Comment

0 Comments

Close Menu