Ad Code

ఐమెసేజ్ కంటే వాట్సాప్‌ బెటర్ !


ప్రపంచంలోని అన్ని దేశాల్లో వాట్సాప్ అత్యధిక యూజర్లతో అగ్రస్థానంలో  ఉంది. కానీ యూఎస్‌లో మాత్రం యాపిల్ ఐమెసేజ్‌ను ఎక్కువ మంది వాడుతున్నారు. అమెరికాలోని ప్రజలందరూ కూడా తమ మెసేజింగ్ యాప్‌నే వాడేలా ఎంకరేజ్ చేయడానికి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా యాపిల్ ఐమెసేజ్ కంటే తమ వాట్సాప్ చాలా సెక్యూర్, ప్రైవేట్ అంటూ పోస్ట్ పెట్టారు. iMessageలో ఉన్న డిసడ్వాంటేజెస్‌ను ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఫన్నీగా వెల్లడించారు. మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ..'గ్రూప్ చాట్‌లతో సహా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ పనిచేసే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వాట్సాప్ iMessage కంటే చాలా ప్రైవేట్, సెక్యూర్. వాట్సాప్‌లో మీరు సింగిల్ బటన్‌ను నొక్కడం ద్వారా అన్ని కొత్త చాట్‌లను కూడా డిసప్పియర్ అయ్యేలా సెట్ చేయవచ్చు. గతేడాది మేం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌లను కూడా తీసుకొచ్చాం. ఈ ఫీచర్లన్నీ ఇప్పటికీ iMessageలో లేవు.' అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో iMessageలో కనిపించే గ్రీన్ బబుల్, బ్లూ బబుల్ చూపించే ఒక ఫొటో కూడా షేర్ చేశారు. సాధారణంగా ఐమెసేజ్ అనేది రెండు యాపిల్ డివైజ్‌ల మధ్య మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ ఐ-మెసేజ్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు మెసేజ్ చేస్తే.. ఆ మెసేజ్ కాస్త సాధారణ ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తుంది. ఇలా ఎస్ఎంఎస్ రూపంలో వెళ్లే మెసేజ్‌లన్నీ కూడా గ్రీన్ కలర్ బబుల్‌లో కనిపిస్తాయి. ఈ SMSలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదు. అప్పుడు యూజర్ల ప్రైవసీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే జుకర్‌బర్గ్ ఐమెసేజ్‌తో పూర్తిగా ప్రైవసీ ఉండదని, కానీ తన వాట్సాప్‌లో ఐఫోన్లు లేదా ఆండ్రాయిడ్ ఫోన్లకు మెసేజ్ పంపినా పూర్తి ప్రైవసీ ఉంటుందని ఈ పోస్ట్ ద్వారా సింబాలిక్‌గా చెప్పారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలోని పెన్సిల్వేనియా స్టేషన్‌లో మెటా కంపెనీ ఐమెసేజ్ గ్రీన్ బబుల్, బ్లూ బబుల్ చూపించే ఒక యాడ్ కూడా ఉంచింది. ఈ పోస్టర్ ఫొటోనే జుకర్‌బర్గ్ షేర్ చేశారు. యాపిల్ iMessageలో ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు బ్లూ కలర్‌కి బదులుగా గ్రీన్ బబుల్‌లో కనిపిస్తాయి. వాట్సాప్‌లో మాత్రం అన్నీ కూడా ఒకే కలర్‌లో ప్రైవేట్ బబుల్‌గా ఉంటాయని ఈ ప్రకటన సారాంశం. యునైటెడ్ స్టేట్స్‌లో వాట్సాప్ కంటే ఐమెసేజ్ వాడేవారి సంఖ్య ఎక్కువ. వారందరినీ తమ యాప్‌కు మళ్లించేందుకు మెటా సీఈఓ మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను రీస్టార్ట్ చేశారు. మరి ఈ ప్రచారంతోనైనా యూఎస్‌లో వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతుందో లేదో చూడాలి. ఇక వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎంత ముఖ్యమో, వాట్సాప్‌లో యూజర్లు ఎందుకు జాయిన్ కావాలో ఒక ట్వీట్ థ్రెడ్ ద్వారా వివరించారు. యూఎస్‌లోని ప్రజలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రాముఖ్యత గురించి చెప్పడానికి మేం జనవరిలో ప్రారంభించిన మార్కెటింగ్ ప్రచారాన్ని ఇప్పుడు మరింత పెంచుతున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu