Ad Code

మనిషి ప్రయాణించే తొలి దేశీయ డ్రోన్‌ !


డ్రోన్ల తయారీ, రవాణాలో నవ శకం మొదలైంది. ఇప్పటి వరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లు వాడేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్‌ మన కండ్ల ముందు సాక్షాత్కరించనున్నది. దేశీయంగా తయారైన డ్రోన్‌ 'వరుణ్‌' త్వరలో భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మనిషి ప్రయాణించే డ్రోన్ల తయారీలో ఆమెరికా సరసన భారత్‌ నిలిచింది. తొలిసారిగా దేశీయంగా తయారైన ఈ రకం డ్రోన్లు త్వరలో భారత నావికా దళంలో చేరనున్నాయి. ఈ డ్రోన్‌కు వరుణ్‌ అని పేరు పెట్టారు. దాదాపు 100 కిలోల బరువును మోసుకెళ్లే డ్రోన్లు తయారయ్యాయి. 25 నుంచి 30 కి.మీ. దూరం ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. పుణెకు చెందిన భారతీయ స్టార్టప్ సంస్థ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఈ విషయాలను ఇండియన్‌ నేవీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గాలిలో సాంకేతిక లోపం ఏర్పడిన తర్వాత కూడా ఈ రకం డ్రోన్లు సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ అవుతాయని సాగర్‌ డిఫెన్స్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బబ్బర్ చెప్పారు. ఈ డ్రోన్‌లో ఒక పారాచూట్‌ ఉంటుంది. ఇది అత్యవసర సమయంలో లేదా మాల్‌ ఫంక్షన్‌ సమయంలో ఆటోమెటిక్‌గా తెరుచుకుంటుంది. దాంతో డ్రోన్ సురక్షితంగా భూమిపై ల్యాండ్ అవుతుంది. ఈ రకం డ్రోన్లను ఎయిర్ అంబులెన్స్‌, సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించవచ్చు. వీటిని గత జూలై నెలలో విజయవంతంగా పరీక్షించారు. ఈ డ్రోన్లతో దేశ నిఘా, భద్రత మరింత పటిష్టం అవుతుందని ఇండియన్‌ నేవీ పేర్కొన్నది. అదేవిధంగా అత్యవసర వైద్య సేవల పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగించవచ్చునని వెల్లడించింది. 

Post a Comment

0 Comments

Close Menu