Ad Code

ఫాక్స్‌కాన్ నుంచి వైదొలిగిన 20 వేల మంది ఉద్యోగులు !


చైనాలోని జెంగ్‌జౌలో ఫాక్స్‌కాన్ కంపెనీ నుంచి 20 వేల మందికి పైగా వైదొలిగారు. ఐ-ఫోన్ తయారీ దారు ఫాక్స్‌కాన్‌. భారీ స్థాయిలో ఉద్యోగులు వైదొలగడంతో ఈ నెలాఖరుకల్లా పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపట్టాలన్న ఫాక్స్‌కాన్ లక్ష్యం దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించడానికి ఫాక్స్‌కాన్ నిరాకరించింది. తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న ఈ ఫాక్స్‌కాన్ కంపెనీ యాజమాన్యం ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న వారికి 1396 డాలర్లు పరిహారం చెల్లిస్తామని ఆఫర్ చేసింది. నూతన ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతన చెల్లింపుల్లో సమస్య తలెత్తడంతో నిరసనలకు దారి తీసింది. ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సంస్థ సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణలకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో తేడాలకు సాంకేతిక లోపం తలెత్తిందని, అందుకు క్షమాపణ చెబుతున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రకటించింది. చెల్లింపుల్లో బకాయిలకు తోడు కఠిన కరోనా ఆంక్షలు కూడా సిబ్బంది రాజీనామా చేయడానికి దారి తీసిందని బాధితులు చెబుతున్నారు. దీంతోనే వర్కర్లంతా తమ లగేజీలతో సొంతిండ్లకు బయలుదేరి వెళ్లేందుకు బస్సుల ముందు బారులు తీరారు. సిబ్బంది రాజీనామా చేశారని పేర్కొన్న ఫాక్స్‌కాన్‌.. ఎంత మంది వైదొలిగారన్న సంగతి వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఐ-ఫోన్ల ఉత్పత్తిపై ఉద్యోగుల రాజీనామాలు ప్రతికూల ప్రభావం చూపబోవని ఫాక్స్‌కాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొత్త సిబ్బంది ఇంకా శిక్షణ పొందాల్సి ఉందన్నారు. రికార్డు స్థాయిలో చైనాలో కరోనా కేసులు నమోదు కావడంతోపాటు పదేపదే లాక్‌డౌన్‌లు విధించడం, ఫాక్స్‌కాన్ మేనేజ్‌మెంట్ పట్ల అసంతృప్తి తదితర కారణాలతో సిబ్బంది వైదొలుగుతున్నారని తెలుస్తున్నది.

Post a Comment

0 Comments

Close Menu