Ad Code

ఎలాన్ మస్క్ కుప్పిగంతులు ?


ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్  నిర్ణయాలు సంస్థ భవితవ్యాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తున్నది. ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే ఈ నెలలోనే వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపి, వారిలో కొందరిని తిరిగి నియమించుకున్నారు. అలా నియమించుకున్న ఉద్యోగుల్లో మరి కొందరికి ఉద్వాసన పలికాడని సమాచారం. అలా తొలగింపునకు గురైన వారిలో హెచ్-1 బీ వీసాపై పని చేస్తున్న ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ హెచ్‌-1బీ వీసా దారుడు సంస్థ ఉద్యోగుల అభిప్రాయాలు తెలిపే బ్లైండ్ అనే సోషల్ మీడియా యాప్‌లో షేర్ చేశాడు. హెచ్‌-1 బీ వీసాపై ఉన్న తాను కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజులే టైం ఉందని, తనకు సాయం చేయమని అభ్యర్థించాడు. ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను పీటర్ యాంగ్ అనే రెడిట్ ఉద్యోగి ట్వీట్ చేయడంతో వైరలైంది. దీంతో మస్క్ తీరు పట్ల నెటిజన్లు మండి పడుతున్నారు. ఈ నెల ఆరంభంలో వేల మందికి ఉద్వాసన పలికిన ట్విట్టర్ నూతన యాజమాన్యం.. తొలగింపునకు గురైన వారికి మూడు నెలల వేతనం ఆఫర్ చేసింది. అలా ఉద్వాసనకు గురైన వారిలో ప్రతిభావంతులుగా ఉన్న కొందరిని నియమించుకున్నది. డాక్యుమెంటేషన్‌, కోడ్ శాంపిల్స్‌లో నా సేవలు అవసరం అని ట్విట్టర్ తీసుకుందని ఆ మాజీ ఉద్యోగి తెలిపాడు. మళ్లీ ఏం జరిగిందో తెలియదు..ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గత రాత్రి తిరిగి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ట్విట్టర్ తెలిపిందని చెప్పాడు. భృతిగా తనకు నాలుగు వారాల వేతనం అందుతుందన్నాడు. హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉన్నానని, సాయం చేయగలిగిన వారు తనను సంప్రదించాలని వేడుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఎలన్‌ మస్క్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu