Ad Code

మెక్సికోలో తోకతో జన్మించిన ఆడ శిశువు !


ఈశాన్య మెక్సికోలోని న్యూవో లియోన్ రాష్ట్రంలోని గ్రామీణ ఆసుపత్రిలో ఈ ఆడ శిశువు జన్మించింది. తల్లి ప్రసవం సాధారణ పద్ధతిలో కాకుండా సిజేరియన్‌ జరిగింది. బాలిక తల్లిదండ్రులు 20-30 ఏండ్ల వయసు మధ్య ఉండి, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి రేడియేషన్ లేదా ఇన్ఫెక్షన్‌కు గురికాలేదు. తల్లిదండ్రులకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. వారికి 2.2 అంగుళాల పొడవు తోకతో ఓ ఆడ శిశువు జన్మించింది. కొద్ది సేపటికి మరో 0.8 సెంటీ మీటర్లు పొడవు పెరగడంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. ఇలాంటి కేసులు ప్రపంచంలో 40 మాత్రమే గుర్తించినట్లు వైద్యులు చెప్తున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి తోకను తొలగించారు. బాలికను రెండు నెలల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. చిన్నారి ఆరోగ్యంగా ఉన్నదని మెక్సికో న్యూవో లియోన్‌ వైద్యులు తెలిపారు. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీలో ప్రచురించబడిన ఈ కేసు నివేదిక ప్రకారం, ఆడ శిశువు తోక పొడవు 5.7 సెం.మీ. దీని వ్యాసం 3-5 మి.మీ. పుట్టినప్పుడు తోక గుండ్రటి కొనతో వెంట్రుకలు కలిగి ఉన్నది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత రెండు నెలల పాటు వైద్యులు ఆమెను పర్యవేక్షించారు. ఈ సమయంలో శిశువు సాధారణ పిల్లల్లా పెరుగుతున్నదని గుర్తించారు. బరువు కూడా సాధారణంగానే ఉన్నదని, గుండెలో ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తేల్చారు. చిన్నారి తోకలో ఎముక లేకపోవడంతో మెత్తగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. తోక కదిలించినప్పుడు ఎలాంటి నొప్పి కూడా కలుగలేదు. పలు పరీక్షలు చేసి తోక కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అనంతరం బాలికకు లింబర్గ్‌ ప్లాస్టీ సర్జరీ చేసి శరీరం నుంచి తోకను తొలగించారు. ఇప్పటివరకు మనుషుల్లో రెండు రకాల తోకలను వైద్యులు కనుగొన్నారు. మొదటిది వెస్టిజియల్‌ టేల్‌, రెండోది ట్రూ టేల్‌. ఇంగ్లండ్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, జర్మనీలో నిర్వహించిన అధ్యయనాల్లో ఇప్పటివరకు 195 కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu