Ad Code

భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే !


దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. కార్బన్ ఉద్గారాలను వీలైనంత వరకు తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీలను వినియోగించేలా ప్రోత్సహిస్తుండడం కలిసి వచ్చే అంశం. ఇటీవల బైన్ & కో అనే సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై ఓ రిపోర్ట్ వెల్లడించింది. రాబోయే ఎనిమిదేళ్లల్లో అంటే 2030 నాటికి టూ వీలర్ సెగ్మెంట్‌లో 40-45 శాతం ఈవీలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫోర్ వీలర్‌ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో ఈవీలు 15-20 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంటే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనుందని ఈ నివేదిక ద్వారా అంచనా వేయొచ్చు. దేశంలో ఈవీ మార్కెట్ వృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు కూడా కారణమని రిపోర్ట్ పేర్కొంది. ఈవీ తయారీ సంస్థలు దేశీయంగా ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం, ఈవీలను కొనుగోలు చేసేలా కస్టమర్లను ప్రోత్సహించడం వంటి వాటి ద్వారా దేశంలో ఈవీ మార్కెట్ గణనీయమైన వృద్దిని కనబరుస్తుందని బైన్ & కో అంచనా వేసింది. దీంతో 2030 నాటికి భారత్‌లో ఏటా దాదాపు 12 మిలియన్ల నుంచి 13 మిలియన్ల కొత్త టూవీలర్ ఈవీల విక్రయాలు జరిగే అవకాశం ఉందని, అలాగే ఈవీ ఫోర్‌వీలర్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఒక మిలియన్ జరిగే అవకాశం ఉందని బైన్ & కో రిపోర్ట్ వెల్లడించింది.  2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధితో మెటీరియల్‌లో కొత్తగా రాబడులు, లాభాలు వస్తాయని సదరు సంస్థ పేర్కొంది. దీంతో ఈవీ మార్కెట్‌లో 76 బిలియన్ల డాలర్‌ల నుంచి 100 బిలియన్లకు క్యుములేటివ్ ఆదాయ అవకాశాలు, 8 బిలియన్ల డాలర్‌ల నుంచి 11 బిలియన్లకు లాభాలు పెరుగుతాయని బైన్ & కో రిపోర్ట్ పేర్కొంది.  ఈవీ రంగంలోని వివిధ విభాగాల్లో పెట్టుబడులు కూడా ఈ రంగం వృద్ధికి కీలకంగా మారనున్నాయి. స్థానికంగానే తయారీ, బ్యాటరీ అసెంబుల్‌, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS), సాఫ్ట్‌వేర్, టెలిమాటిక్స్ వంటి విభాగాల్లో పెట్టుబడులు రావడం ఈవీ రంగ వృద్ధిని పెంచుతాయని తెలిపింది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, మొబిలిటీ సేవలు, తుది వినియోగదారు అవసరాలను తీర్చడానికి ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈవీ మార్కెట్‌ను మరింత పెంచుతాయని పేర్కొంది.  కార్‌దేఖో, ఓమ్నికామ్ మీడియా గ్రూప్ గతేడాది నిర్వహించిన సర్వే వివరాలను బైన్ & కో హైలెట్ చేసింది. దాదాపు 66 శాతం మంది వినియోగదారులు EVలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, 68 శాతం మంది పర్యావరణంపై ఆందోళన వ్యక్తం చేశారని, కాలుష్యాన్ని తగ్గించడానికి వీరంతా ఈవీలను కొనుగోలు చేసే అవకాశం ఉందన్న విషయాన్ని బైన్ & కో హైలెట్ చేసింది. దీర్ఘకాలికంగా సబ్సిడీలు లేనప్పుడు ICE వాహనాల ధరలతో పోటీ పడాలంటే ఈవీ బ్యాటరీల ధరలను అదనంగా 20-30 శాతం తగ్గించాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఈక్యూప్‌మెంట్ తయారీదారు (OEM) భారతీయ మార్కెట్ కోసం కొత్త, స్థిరమైన EV-స్పెసిఫిక్ బిజినెస్ మోడల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈవీ అడాప్షన్ కోసం ప్రభుత్వాలు వినియోగదారు, ప్రొడ్యూసర్ ఇన్సెంటివ్స్ , రెగ్యూలెటరీ సపోర్ట్‌ను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈవీల వాల్యూమ్‌కు మద్దతు ఇవ్వడానికి దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించాల్సిన అవసరం ఉందని బైన్ & కో రిపోర్ట్ అభిప్రాయపడింది. 

Post a Comment

0 Comments

Close Menu