Ad Code

రీల్స్, షాట్స్ పై కంట్రోలింగ్ ఏది ?


స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే చాలా మంది పిల్లలు బొమ్మల కంటే స్మార్ట్ ఫోన్ల కోసమే ఎక్కువ ఏడుస్తున్నారు. మరో వైపు కొత్తగా వచ్చిన షాట్స్‌, రీల్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటిని చూస్తూ లోకాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇన్ స్టా రీల్స్, షార్ట్స్‌ ద్వారా ఎంతో మంది టాలెంట్ బయటపడింది. చాలా మంది సెలబ్రిటీలుగా కూడా మారారు. అయితే వీటి వల్ల జరిగిన ప్రయోజనం కంటే జరుగుతున్న నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని ఏ పని చేయకుండా, చదువుకోకుండా చాలా మంది పిల్లలు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న చందానా చాలా మంది పిల్లలు ప్రవర్తిస్తున్నారు. రీల్స్, షార్ట్స్ చేస్తామంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదువుకునే వయసులో పుస్తకాన్ని పక్కన పెట్టేసి స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటున్నారు. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు? అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు పట్టిచుకోవాల్సి ఉంటుంది. ఫోన్లలో బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేయడం, యూట్యూబ్, పలు సోషల్ మీడియా ఖాతాల్లో పేరెంటింగ్ కంట్రోల్ ఆన్ చేయడం. ఇబ్బంది కలిగించే దృశ్యాలు, పిల్లలు చూడకూడని వీడియోలు డిస్ ప్లే కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఫోన్ ఇస్తున్నాం వాళ్లు కాసేపు టైమ్ పాస్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ, ఆ సమయంలో వాళ్లు ఏం చూస్తున్నారు అనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఫోన్ వాడుతూ వాళ్లు చదువులను అటకెక్కిస్తున్నారు. పట్టించుకోవాల్సిన తల్లిదండ్రులు కూడా.. మమ్మల్ని డిస్టర్బ్‌ చేయకుండా ఫోన్‌ చూసుకుంటున్నారులే అని లైట్ తీసుకుంటున్నారు. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించడానికి, ఏడుపు మానిపించడానికి స్మార్ట్ ఫోన్ చేతికిస్తే.. ఇప్పుడు వాళ్లు స్మార్ట్ ఫోన్ లేకపోతే జీవించలేము అన్నట్లు తయారవుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పైపెచ్చు సోషల్ మీడియాలో ఇప్పుడు అభ్యంతరకర వీడియోలే ఎక్కువగా వస్తున్నాయి. రీల్స్, షాట్స్ లో అవే ఎక్కువ దర్శనమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరైన కంట్రోల్, పర్యవేక్షణ లేకుండా తల్లిదండ్రులు బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ చెడిపోతుంది. ఆ వీడియోలు, రీల్స్ వారి జీవితంపై చాలా ప్రభావం చూపించవచ్చు. పసి వయసులోనే వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పిల్లలను ఫోన్ కు దూరంగా పెట్టడం, ఫోన్ వాడుతుంటే ఏం చేస్తున్నారు అనే అంశాలను పరిశీలిచడం చేయాలి. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే వాళ్లు పేరెంటింగ్ కంట్రోల్ గురించి కూడా తెలుసుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu