భూమి అతి చెరువుగా భారీ గ్రహ శకలం !


భూమికి చంద్రుడికి మధ్యలోకి ఓ భారీ గ్రహ శకలం శనివారం రానుంది. చంద్రుడి కంటే రెండు రెట్లు భూమికి దగ్గర వస్తుందని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇది 107,500 మైళ్ల (173004 కిలోమీటర్ల) దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ గ్రహ శకలానికి 2023 డీజెడ్2 అని నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ గ్రహశకలాన్ని ఫిబ్రవరి 27న తొలిసారిగా కనిపెట్టారు. యూరోపియన్ నియర్ ఎర్త్ ఆస్ట్రరాయిడ్స్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. ఆ సమయంలో అది భూమికి 159 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 3.16 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఈ గ్రహశకలం మళ్లీ 2026లో భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు గనుక ఢీకొట్టకపోతే.. 2029లో భూమికి మరింత దగ్గరగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు పదేళ్లకోసారి ఏదైనా గ్రహశకలం ఇంత దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ వాటి సైజ్ 140 నుంచి 310 అడుగులు ఉన్నవి దగ్గరగా వస్తూ ఉంటే.. దాన్ని గమనించడం అరుదైన అవకాశంగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ గ్రహ శకలాన్ని కళ్లారా చూసే వీలు ఉంది. ఐతే.. ఆగ్నేయ ఆసియా దేశాల వారికి మాత్రమే ఇది కనిపిస్తుంది. భారత్‌లో ప్రజలకు ఇది కనిపించదు. ఈ 200 అడుగుల వెడల్పు ఉన్న రాయిని నాసా ఆస్ట్రరాయిడ్ టీమ్ పరిశీలిస్తోంది. ఇవాళ వచ్చే గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవు. కానీ.. దగ్గరగా వస్తోంది కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి గ్రహశకలాల్ని అంతరిక్షంలోనే పేల్చి వేసే టెక్నాలజీని మనం మరింతగా డెవలప్ చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆమధ్య నాసా ఓ చిన్న గ్రహశకలాన్ని విజయవంతంగా పేల్చివేసింది.

Post a Comment

0 Comments