Ad Code

చంద్రుని ఉపరితలంపై నీరు !


చంద్రునిపై వెళ్లడానికి దాదాపు అన్ని దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో చంద్రునిపై సుదీర్ఘకాలం మానవులు నివసించడానికి కావలసిన వనరులున్నాయన్న అంశాలు కొత్తగా వెలుగు లోకి వచ్చి ఆసక్తిని కలిగిస్తున్నాయి. చంద్రుని ఉపరితలంపై విస్తరించి ఉన్న గాజు పూసల్లో కొన్ని లక్షల టన్నుల నీరు నిక్షిప్తమై ఉందని, ఆ పూసల నుంచి నీటిని సేకరించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చంద్రునిపై చిన్నపాటి ఉల్కలు దాడి చేయగా, వాటి వేడికి చంద్రుని ఉపరితలం కరిగి వెలువడిన పదార్ధం , తరువాత చల్లబడడంతో గాజు పూసలుగా ఏర్పడిందని అంటున్నారు. చైనా చాంగే 5 మిషన్ తీసుకొచ్చిన చంద్రుని మట్టి నమూనాలను శాస్త్రవేత్తలు పరిశోధించగా ఈ విషయం బయటపడింది. అయితే నీరు తయారు కావాలంటే హైడ్రొజన్ అవసరం. ఆ హైడ్రొజన్ కణాలు సౌర వాయువుల నుంచి భారీ ఎత్తున వెలువడ్డాయి. మొత్తం సౌర వ్యవస్థకే ఈ హైడ్రొజన్ నలుసులు వ్యాపించాయి. నీటికి అవసరమైన ఆక్సిజన్ చంద్రునిలోని శిలలు, ఖనిజాల్లో ఇరుక్కుని ఉన్నప్పటికీ చంద్రుని ఉపరితలంపై సగానికి సగం విస్తరించి ఉంది. ఈ విధమైన నీటి పొర చంద్రుని లోతైన మట్టి పొరల్లో ఉందని పేర్కొన్నారు. హైడ్రొజన్ ఐసొటోప్ సమ్మేళనం, భూమి లోపలి భాగం (కోర్) నుంచి పైన అంచు వరకు వ్యాపించి ఉందని గాజు పూసలలో ఉన్న దీన్ని చంద్రుని మట్టి నుంచి వడపోయడమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రునిపై కావలసినంత నీరు నిల్వ ఉందని అర్థం చేసుకోడానికే ఈ ప్రక్రియగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో చాంగె5 మిషన్ సేకరించిన చంద్రుని ప్రభావిత గాజు పూసలను అధ్యయనం చేశామని చెప్పారు. దీనివల్ల గత అధ్యయనానికి భిన్నంగా సౌర గాలుల నుంచి భారీ మొత్తంలో చంద్రుని ఉపరితలం పైకి నీరు వచ్చి చేరిందని ఇప్పుడు అర్థమైందని ప్రకటించారు. ఈ పూసల సైజు ఒక వెంట్రుక నుంచి అనేక వెంట్రుకల పరిమాణంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి ఒకటి రెండు కావు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయని, అందువల్ల నీటవనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పవచ్చని అధ్యయనంలో పాలుపంచుకున్న నాన్‌జింగ్ యూనివర్శిటీకి చెందిన హెజియు వివరించారు. అయితే చంద్రుని ఉపరితలంపై తవ్వకం అన్నది చాలా కష్టం. సౌరగాలుల్లోని హైడ్రొజన్ నిత్యం చంద్రునిపై దాడి చేస్తుండటంతో ఈ పూసలు నీటితో నిండి ఉంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ పూసలు అంతలెక్కా ఉన్నాయి. వీటిని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో కరిగించి నీటిని సేకరించుకోవచ్చు. బహుశా భవిష్యత్తులో రోబోలే వ్యోమగాములుగా చంద్రుని పైకి వచ్చి ఈ పనులన్నీ చేస్తాయేమో. ఇది సాధ్యమౌతుందా? ఈనీరు తాగడానికి పనికి వస్తుందా ? అని నిర్ణయించడానికి మరిన్ని పరిశోధనలు చేపట్టవలసిన అవసరం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు అర్ధశతాబ్దం క్రితం అపోలో చంద్రయాత్రలో సేకరించి తెచ్చిన చంద్ర శిలలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చంద్రునిపై అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్లనే గాజు పూసలు నీటితో ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. చంద్రుని ఉపరితలంపై ఆవరించిన పూసలను వేడి చేసి నీటిని తీసుకోవడం, ఈమేరకు ఇతర పదార్థాలను ప్రాసెస్ చేయడం రేపటి వ్యోమగాములకు నీరు , ఆక్సిజన్ సరఫరా చేయడానికి దారి చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu