Ad Code

లక్ష మంది స్టార్టప్ ఉద్యోగులకు లే-ఆఫ్ ముప్పు ?


అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీయడంతో అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల్లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని తెలుస్తున్నది. అమెరికాలోనే లక్ష మంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రముఖ స్టార్టప్ సంస్థ వై-కాంబినేటర్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లోని 200 స్టార్టప్‌లతోపాటు ప్రపంచవ్యాప్తంగా వేల స్టార్టప్‌లు ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టాయని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ తదితరులకు ఫిర్యాదు చేసింది. ఎస్వీబీ దివాళా తీయడంతో తదుపరి ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరింది. వై-కాంబినేటర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీటాన్‌తోపాటు 3500 స్టార్టప్‌ల సీఈవోలు, ఫౌండర్లు, వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగులు రెండు లక్షల మంది ఈ పిటిషన్‌పై సంతకాలు చేశారు. స్టార్టప్‌లు, వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వై కాంబినేటర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీ టాన్ కోరారు. లైట్‌స్పీడ్‌, బియాన్ క్యాపిటల్‌, ఇన్‌సైట్ పార్టనర్స్‌తోపాటు 2500కి పైగా వెంచర్ క్యాపిటల్ సంస్థలు.. ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టాయి. ఎస్వీబీలో కస్టమర్ల డిపాజిట్లు 175 బిలియన్ డాలర్లు ఉన్నాయి.గ్లోబల్ సాఫ్ట్‌వేర్-యాస్‌-ఏ-సర్వీస్ (సాస్ SaaS) బేస్డ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్షన్ కథనం ప్రకారం ఎస్వీబీ పతనంతో భారత్‌లో కనీసం 21 స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుస్తుంది. ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టిన భారతీయ స్టార్టప్‌ల పేర్లు గానీ, తీవ్రంగా దెబ్బతినే ప్రభావం గల స్టార్టప్‌ల వివరాలు గానీ ట్రాక్షన్ వెల్లడించలేదు. యావత్ ప్రపంచ స్టార్టప్‌లకు సేవలందిస్తున్న అమెరికా బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న ఎస్వీబీ దివాళా తీయడం తీవ్ర నిరాశ, ఆందోళన కలిగిస్తున్నదని టాప్ వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలు ఉమ్మడి ప్రకటన చేశాయి. మరోవైపు, ఈ బ్యాంక్ దివాళా తీయడంతో డిపాజిటర్లకు భరోసా కల్పించేందుకు శుక్రవారం అమెరికా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఎస్వీబీని తన నియంత్రణలోకి తీసుకున్నది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాళాతో తలెత్తిన సంక్షోభ పరిస్థితుల నుంచి స్టార్టప్‌లను బయటపడవేయడానికి మార్గాంతరాలపై కేంద్రం దృష్టి సారించింది. స్టార్టప్‌లను కాపాడేందుకు అవసరమైన సాయం అందించడానికి వాటి వ్యవస్థాపకులు, సీఈవోలతో వచ్చేవారం భేటీ కానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్వీబీ పతనంతో ఆ బ్యాంకులో పలు భారతీయ స్టార్టప్ సంస్థలు నిధులు డిపాజిట్ చేశాయి. ఫలితంగా ఆయా స్టార్టప్‌ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. `ఎస్వీబీ దివాళా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. #న్యూఇండియాఎకానమీలో స్టార్టప్‌లు చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి` అని రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఆయా స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసి, వాటికి చేయూతనందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకోసం వచ్చేవారం స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలతో భేటీ అవుతున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu