Ad Code

స్కార్పియో-ఎన్‌ జీవితంలో మరో రోజు !


మహీంద్రా సంస్థకు దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎంతో ఆదరణ ఉంది. ముఖ్యంగా ఎస్‌యూవీ శ్రేణిలో ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. గతేడాది స్కార్పియో-ఎన్‌  అనే వాహనాన్ని మహీంద్రా సంస్థ విడుదల చేసింది. గతంలో విడుదలైన స్కార్పియో ఎస్‌యూవీకి కొనసాగింపుగా ఈ మోడల్‌ను పరిచయం చేసింది. అయితే, ఇటీవల ఓ వ్యక్తి స్కార్పియో-ఎన్‌ సన్‌రూఫ్‌ చెక్‌ చేసేందుకు వాహనాన్ని ఓ జలపాతం కింద ఉంచాడు. ఆ సమయంలో వాహనంపై పడిన నీరు లోపల ఉన్న స్పీకర్ల ద్వారా కారులోకి రావడంతో  సదరు వ్యక్తి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ వీడియోకు సమాధానంగా మహీంద్రా సంస్థ స్కార్పియో-ఎన్‌ ఎస్‌యూవీని అదే జలపాతం కింద పరీక్షించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అందులో స్కార్పియో-ఎన్‌ పై భాగం నుంచి నీళ్లు వేగంగా పడుతున్నప్పటికీ కారు లోపలికి ఎలాంటి నీరు రాకపోవడం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ''స్కార్పియో-ఎన్‌ జీవితంలో మరో రోజు'' అని ట్వీట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహీంద్రా సంస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. ''మంచి సందేశం, ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానం, మహీంద్రా టీమ్‌కు అభినందనలు'', ''మీ టీమ్‌ పని తీరుకు ఇది నిదర్శనం'', ''నకిలీ వీడియోతో యూజర్ల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించిన వ్యక్తికి  ఓర్పు, తెలివితో మహీంద్రా చక్కగా బదులిచ్చింది'' అని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఆటోమొబైల్‌ సంస్థలు తయారు చేసే ప్రతి వాహనానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మార్కెట్లోకి పంపుతాయి. ఒకవేళ వాటిలో ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వాటిని రీకాల్ చేసి, సమస్యను సరి చేసి ఇస్తుంది. అలానే యూజర్లు ఏవైనా సమస్యలు గుర్తిస్తే వాటి పరిష్కారం కోసం కంపెనీ సంప్రదిస్తే వాటిని రిపేర్‌ చేస్తుంది. అయితే యూజర్‌ పోస్ట్ చేసిన వీడియో కారులోకి నీరు ఎందుకు వచ్చాయనేది తెలియరాలేదు. కారులో సమస్య ఉంటే ముందుగా అతను కంపెనీని సంప్రదించాల్సిందని, అలా కాకుండా ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం వల్ల కంపెనీపై కొనుగోలుదారులకు చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 

Post a Comment

0 Comments

Close Menu