Ad Code

టెలిగ్రామ్‌ అడ్డాగా సైబర్‌ దోపిడీ ?


పార్ట్‌టైమ్‌, ట్రేడింగ్‌ పేరుతో అమాయకులకు వల వేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు టెలిగ్రామ్‌ యాప్‌ను వేదికగా చేసుకుంటున్నారు. వివిధ రకాలుగా ఆకర్షిస్తూ లక్షల్లో ముంచుతున్నారు. ఇలా నిత్యం ట్రై కమిషనరేట్లకు 10కి పైగా ఫిర్యాదులందుతుండగా, నెలకు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు సైబర్‌ దోపిడీ జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో ఈ మొత్తం ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గతంలో వాట్సాప్‌ వేదికగా జరిగే ఈ మోసాలు ఇప్పుడు టెలిగ్రామ్‌ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. వివిధ పద్ధతుల్లో జరుగుతున్న ఈ మోసాలు చివరకు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌గా మారిపోతున్నాయి. ఈ మోసాలకు సంబంధించిన సూత్రధారులు కొందరు చైనీయులే ఉంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో ఎక్కువగా వాట్సాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌కు సంబంధించిన గ్రూపుల్లో అందరిని చేర్చేవారు. ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు తమ దృష్టిని టెలిగ్రామ్‌ వైపు మళ్లించారు. టెలిగ్రామ్‌లో సులువుగా చేరేందుకు అవకాశముండటం, ఇతరులను ఈజీగా కాంటాక్టు అయ్యేందుకు అవకాశాలుండటంతో ఇప్పుడు ఈ యాప్‌లో ఎక్కువగా అమాయకులకు వల వేస్తున్నారు. నేరం చేసేవాడు తప్పించుకునేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో దీనిని వేదికగా చేసుకుంటున్నారు. ఎవరినైనా గ్రూప్‌లో చేర్చుకునేందుకు అవకాశముండటంతో, ఎక్కువ మందిని ఆ గ్రూపుల్లో చేర్చుకుంటున్నారు. దీంతో ఆ గ్రూపుల్లో వివిధ రకాల చర్చలు జరుగుతుండటాన్ని చూసి కొందరు ఆకర్షితులవుతుండగా, మరికొన్ని సందర్భాల్లో సైబర్‌ నేరగాళ్లు చెప్పే విషయాలతో ఏకీభవిస్తూ, వాళ్లిచ్చే లింక్‌లను బాధితులు క్లిక్‌ చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు ఆయా గ్రూపుల్లో జరిగే చర్చలకు అంగీకరిస్తూ, లింక్‌లు క్లిక్‌ చేసి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని, మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తూ, ఆ తర్వాత లక్షల రూపాయలు వివిధ టాస్క్‌ల పేరుతో పెట్టుబడి పెట్టించి మోసాలు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రై పోలీస్‌ కమిషనరేట్లలో నమోదవుతున్న ఆర్థికపరమైన సైబర్‌ నేరాల్లో 30% నుంచి 40% ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu