Ad Code

20న అరుదైన హైబ్రిడ్‌ సూర్యగ్రహణం !


ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు హైబ్రిడ్‌ సూర్యగ్రహణంగా పేర్కొంటున్నారు. ఒకే రోజు మూడు రకాల సూర్యగ్రహణాలు కనిపించనుండడంతో 'హైబ్రిడ్‌' గ్రహణంగా పేర్కొంటున్నారు. ఈ గ్రహణాన్ని నిగలు సూర్యగ్రహణం, శంకర సూర్యగ్రహణం లేదంటే కంకణాకార సూర్యగ్రహణం అని కూడా పిలుస్తుంటారు. ఈ నెల 20న ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1.29 గంటల వరకు కొనసాగనున్నది. అయితే, ఈ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదని జాతీయ అవార్డు గ్రహీత సైన్స్ బ్రాడ్‌కాస్టర్ సారిక తెలిపారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్త్ వెస్ట్‌ కేప్‌లో దర్శనమిస్తుంది. ఇక హైబ్రిడ్‌ సూర్యగ్రహణం చివరిసారిగా 2013లో దర్శనమిచ్చింది. మళ్లీ దాదాపు 140 సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హైబ్రిడ్ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు. చంద్రుని నీడ భూమి ఉపరితలంపై కదులుతున్న సమయంలో ఈ గ్రహణం.. సంపూర్ణ సూర్యగ్రహణం నుంచి కంకణాకార (రింగ్ ఆకారంలో)కి మారుతుంది. ఈ గ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఆస్ట్రేలియాలోని గ్రావిటీ డిస్కవరీ సెంటర్ అండ్ అబ్జర్వేటరీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే, ఈ అరుదైన సూర్యగ్రహణంలో ప్రపంచంలోని నాలుగు లక్షల మంది కంటే తక్కువ మంది, సంపూర్ణ గ్రహణం లేదంటే.. కంకణాకార గ్రహణాన్ని చూడగలుగుతారని సారిక చెప్పారు. దాదాపు 700 మిలియన్ల మంది పాక్షిక సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం ఉందన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా ఎక్స్‌మౌత్‌ ద్వీపకల్పంలో కేవలం ఒకే ఒక నిమిషం మాత్రమే కనిపిస్తుందని వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu