ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారీగా ఉద్యోగుల లే-ఆఫ్స్ ప్రకటించాయి. వేలల్లో ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాయి. ఆ జాబితాలోకి భారత ఐటీ దిగ్గజాలు కూడా వచ్చి చేరుతున్నట్లు కనిపిస్తున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఇండియన్ ఐటీ జెయింట్స్.. తమ సిబ్బంది వేతనాల్లో కోతలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెషర్స్ నియామకాలు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. దిగువ శ్రేణి ఉద్యోగుల వేతనాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గానీ, మిడిల్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు, మేనేజర్ల వేతనాల్లో కోతలు ఉండొచ్చునని ఓ హెచ్ఆర్ ఫర్మ్ అసొసియేట్ శ్రీరాం వెంకట్ చెప్పారు. ఆయా మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనిట్ బిజినెస్ పెర్ఫార్మెన్స్‌ను బట్టి వేతనాల్లో కోతలు ఉంటాయని తెలిపారు. `ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం తప్పనిసరిగా కొత్త ఉద్యోగుల నియామకాలు, విస్తరణపై ప్రభావం చూపవచ్చు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఐటీ సంస్థలు కొత్త ఉద్యోగుల నియామక ప్రణాళికల అమలుపై ఆచితూచి స్పందిస్తాయి. ఫలితంగా ఉద్యోగుల వృద్ధి నెమ్మదిస్తుంది` అని ఫోర్‌కైట్స్ (ఏపీఏసీ) హెచ్ఆర్ డైరెక్టర్ కల్యాణ్ దురాయిరాజ్ చెప్పారు. ఇంతకుముందు నియమించుకున్న ఫ్రెషర్ ఉద్యోగులకు తొలుత ఏడాదికి రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీ ఆఫర్ చేసింది విప్రో. ఇప్పుడు వారిని రూ.3.5 లక్షలకే పని చేయాలని కోరుతున్నది. 2022 బ్యాచ్ గ్రాడ్యుయేట్ల నియామకం కూడా జాప్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీతో నియమితులైన ఫ్రెషర్స్ విధుల నిర్వహణ జాప్యం కావడంతోపాటు తక్కువ వేతనానికి పని చేయాలని గత ఫిబ్రవరిలో వారికి సంస్థ ఈ-మెయిల్ పంపింది. ఫిబ్రవరి 20 లోగా వేతన తగ్గింపుపై స్పందించాలని సూచించిందని సమాచారం. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాలుగో త్రైమాసికం ఫలితాలపైనే మార్కెట్, ఐటీ రంగ విశ్లేషకులంతా దృష్టి సారించారు. ఈ నెల 12న టీసీఎస్ గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. అమెరికా, ఈయూ దేశాల్లో కనిపిస్తున్న మాంద్యం సంకేతాలు, బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందుల నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఎలా స్పందిస్తాయని, పరిస్థితులపై ఎటువంటి అంచనాలకు వస్తాయన్న సంగతి తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
0 Comments