Ad Code

అంతరిక్షం నుంచి అద్భుతంగా కనిపిస్తున్న భూమి !


అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా స్పేస్ ఏజెన్సీ 'నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్' ఎల్లప్పుడూ ముందుంటుంది. ఖగోళ విశేషాలు, వాటి చిత్రాలకు సంబంధించి అప్‌డేట్‌లను ఇస్తుంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో చురుగ్గా ఉంటూ అరుదైన చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా మరో వీడియోను నెటిజన్లతో పంచుకుని సర్‌ప్రైజ్ చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్ నుంచి తీసిన భూమి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 2022 మార్చి, 2023 మార్చి మధ్య ఎక్స్‌పెడిషన్స్ 67, 68 సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) ఈ దృశ్యాలను రికార్డ్ చేసింది. 409 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ISS, భూబ్రమణాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. భూమిపై నుంచి ప్రపంచాన్ని దాటుతున్న అనుభూతిని మీరు కూడా పొందండి అంటూ నాసా ఈ వీడియోను పోస్ట్ చేసింది. 'సాధారణంగా భూమిని ఇలా చూసే అవకాశం చాలా తక్కువ మందికే దొరుకుతుంది. పూర్తి విభిన్న కోణంలో ఈ నీలి గ్రహం మినుకు మినుకు మంటోంది. 250 మైళ్ల ఎత్తు నుంచి చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఇక ఇప్పుడు మీ వంతు. కాసేపు మిమ్మల్ని మీరు స్పేస్ స్టేషన్ సిబ్బందిగా ఊహించుకోండి. ఓ గంట పాటు ఖాళీ దొరికిందని అనుకోండి. ఈ విశ్రాంత సమయంలో మన సొంత గ్రహాన్ని చూడటానికి మించి పెద్ద పనేముంటుంది. ప్రపంచం ఇలా కదిలిపోతుంటే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి' అంటూ పోస్టులో తెలిపింది. నాసా షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. 'ఆహా.. ఇంత అతి సుందరమైన వీడియోను చూడటానికి రెండు కళ్లు చాలవు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్పేస్ లవర్స్ ఈ వీడియోను తెగ లైక్ చేస్తున్నారు. 'మెస్మరైజింగ్.. ఫొటోలు, వీడియోల్లో కాకుండా ఏదో ఒక రోజు నేను కూడా భూమిని ఇలా చూడాలని అనుకుంటున్నా' అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. 'ఉరుములు, మెరుపులను ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు' అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu