Ad Code

లిమిటెడ్‌ ఆఫర్‌ అంటే ఏంటి ?


ఏదో ఓ దశలో ఆ మాయలో పడిపోయి.. అవసరం లేకపోయినా ఆఫర్‌ ఉంది కదా అని కొనేసే ఉంటాం. మార్కెట్‌ పరిభాషలో దీన్ని 'లిమిటెడ్‌ ఎడిషన్‌' ట్రెండ్‌ అంటారు. 'లిమిటెడ్‌ ఎడిషన్‌’ అనేది అరుదైన విలాస వస్తువులతో ముడిపడిన వ్యాపార వ్యూహం. 'లిమిటెడ్‌’ అనగానే ప్రత్యేకమైంది అనే అభిప్రాయం ఉంటుంది. జనాలు వరుసలు కడుతారు. అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటారు తయారీ కంపెనీలు. అత్యంత ఖరీదైన బైకులు, కార్లు, నగలు, గ్యాడ్జెట్లు, ఫ్యాషన్‌ వస్తువులు, విలాస సామగ్రికి 'లిమిటెడ్‌ ఎడిషన్‌’ ట్యాగ్‌లైన్‌ జోడిస్తుంటారు. కొత్త డిజైన్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటికి జనాల నుంచి అనుకున్నంత స్పందన రాకపోతే.. దాన్ని లిమిటెడ్‌ ఎడిషన్‌గా ప్రకటించి హంగామా సృష్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. తమ కంపెనీ మీద కస్టమర్లకు నమ్మకం కుదిరేందుకు, ప్రేమ పెరిగేందుకు కొన్ని లగ్జరీ, బ్రాండెడ్‌ ఉత్పత్తులను స్పెషల్‌ ఫీచర్లతోనూ అందిస్తారు. మిగతా ఎడిషన్లతో పోలిస్తే.. లిమిటెడ్‌ ఎడిషన్‌ ఉత్పత్తులు కొంత స్పెషల్‌గానే ఉంటాయి. అన్నిసార్లూ లగ్జరీతో ముడిపెట్టకుండా.. కస్టమర్లకు ప్రత్యేక అనుభవాన్ని, అనుభూతిని అందించేందుకు ఇదో ప్రయత్నం కావచ్చు. 'డీలక్స్‌ ఎడిషన్‌’ అనీ దీన్ని పిలుస్తారు. వీటికి రీసేల్‌ వాల్యూ కూడా ఎక్కువే. ఓ పదేండ్ల తర్వాత యాంటిక్‌ హోదా వచ్చినా రావచ్చు. ఈ కారణంతోనే.. ఖరీదు అనిపించినా కొని పడేస్తారు శ్రీమంతులు. 'అన్‌ లిమిటెడ్‌’ ప్రేమతో ఆత్మీయులకు గిఫ్ట్‌గా ఇస్తారు కూడా. ఈ మధ్యే బీఎండబ్ల్యూ కంపెనీ ది 8ఎక్స్‌ జీఫ్‌ కూన్స్‌ పేరుతో 99 కార్లను లిమిటెడ్‌ ఎడిషన్‌గా విడుదల చేసింది. ఆ కార్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. బీఎండబ్ల్యూ 50వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని విడుదల చేశారు. యాభై ఏండ్ల బీఎండబ్ల్యూ ప్రస్థానాన్ని సూచించేలా ఈ కార్లలో పలు స్పెషల్‌ ఫీచర్లు అమర్చారు. ఆభరణాల తయారీ సంస్థ జవేరి జువెలర్స్‌ గతేడాది బ్రైడల్‌, హెరిటేజ్‌ పోల్కి పేర్లతో లిమిటెడ్‌ ఎడిషన్‌ నగలను విడుదల చేసింది. ఆపిల్‌, సామ్‌సంగ్‌, సోని వంటి మొబైల్‌ కంపెనీలు కూడా లిమిటెడ్‌ ఎడిషన్‌ పేరుతో కొన్ని ఉత్పత్తులను విడుదల చేశాయి. ఇక బైకుల విషయానికి వస్తే హోండా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హీరో, టీవీఎస్‌ లాంటి కంపెనీలు ప్రత్యేక ఫీచర్లు, మైలేజ్‌, ఫ్యూయల్‌ ఇంకా బ్యాటరీ మోడ్‌తో స్పెషల్‌ ఎడిషన్లు రిలీజ్‌ చేశారు. 'ఒకే పీస్‌ మిగిలింది. మీరు వద్దనుకుంటే.. ఇంకొకరు సిద్ధంగా ఉన్నారు' అంటూ తెలివైన సేల్స్‌ సిబ్బంది కొనుగోలుదారులను దారికి తెచ్చుకున్నట్టే ఉంటుంది ఈ వ్యూహం కూడా. పరిమితంగా ఉన్న సరుకుపైనే కస్టమర్‌కు మోజు, క్రేజు. లిమిటెడ్‌ ఎడిషన్‌.. విజయ రహస్యమూ ఇదే. అరుదైన వస్తువులు తమవద్ద ఉండటం ఓ ఘనతగా భావిస్తారు కుబేరులు. దీంతో ఎంత ధరకైనా కొనేస్తారు.

Post a Comment

0 Comments

Close Menu