Ad Code

ఏఐ టెక్నాలజీకి దొరికిపోతారు తస్మాత్ జాగ్రత్త !


విద్యార్థులు స్కూళ్లకు డుమ్మా కొట్టినట్లు ఉద్యోగులు అప్పుడప్పుడు ఆఫీసులకు ఏదో ఒక సాకు చెప్పి లీవ్స్ పెడుతుంటారు. ఈ సాకులలో వారు ఎక్కువగా చెప్పేది జలుబు  చేసిందని. అయితే ఇకపై ఈ కారణం చెప్పి ఆఫీస్‌కి సిక్ లీవ్ పెడితే ఇబ్బందుల్లో పడక తప్పదు. ఎందుకంటే మీరు అబద్ధం ఆడుతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది. అదెలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అడ్వాన్స్ అయింది. ఇది ఉద్యోగులను పని నుంచి తీసేయడమే కాదు పనుల నుంచి తప్పించుకోకుండా కూడా చేయగలుగుతుంది. సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల తాజా స్టడీ ప్రకారం, AI 70% కచ్చితత్వంతో వాయిస్ టోన్ ఆధారంగా ఒక వ్యక్తి జలుబుతో బాధపడుతున్నారో లేదో తెలుసుకుంటోంది.సూరత్‌ లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు 630 మంది వ్యక్తుల వాయిస్ ప్యాటర్న్‌లను విశ్లేషించారు. అందులో 111 మందికి జలుబు ఉంది. నిజంగా జలుబుతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించే ప్రయత్నంలో వీరు వాయిస్ ప్యాటర్న్‌లను విశ్లేషించారు. అందుకు ఏఐపై ఆధారపడ్డారు. సాధారణంగా మానవుల ప్రసంగంలో హార్మోనిక్స్‌ ఉంటాయి. ఈ హార్మోనిక్స్‌ పిచ్  ఎక్కువగా ఉంటే నిశ్శబ్దంగా మారతాయి. హార్మోనిక్స్ అనేవి ఒక సౌండ్ ప్రధాన ఫ్రీక్వెన్సీతో పాటు ఉత్పత్తి అయ్యే ఎక్స్‌ట్రా ఫ్రీక్వెన్సీలు. కాగా జలుబు ఉన్న, లేని వ్యక్తుల వాయిస్‌ను విశ్లేషించడానికి.. వారు నిజంగా అనారోగ్యంతో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు హార్మోనిక్స్‌ గల వాయిస్ ప్యాటర్న్స్‌ను ఉపయోగించారు. మామూలుగా వాటి ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ హార్మోనిక్స్ వ్యాప్తి తగ్గుతుంది. అంతేకాదు, ఒక వ్యక్తికి జలుబు ఉన్నప్పుడు, ఈ హార్మోనిక్స్ అసమాన నమూనాను కలిగి ఉండవచ్చు. వ్యక్తుల మధ్య ఈ హార్మోనిక్స్ వ్యాప్తి/విస్తరణలో తేడాలను విశ్లేషించడానికి, ఈ నమూనాల ఆధారంగా జలుబు ఉన్నవారిని గుర్తించడానికి పరిశోధకులు మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించారు. అధ్యయనం సమయంలో, పార్టిసిపెంట్ల వాయిస్‌ని విశ్లేషించినప్పుడు వారిని ఒక కథను, అలానే 1-40 నంబర్లను చెప్పాలని పరిశోధకులు కోరారు. తరువాత పరిశోధకులు 70% కచ్చితత్వంతో జలుబును గుర్తించగలిగారు. వాస్తవానికి వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అనారోగ్యాన్ని గుర్తించే మార్గాన్ని కనుగొనడమే అధ్యయనం ప్రధాన లక్ష్యం. కాగా పనికి సెలవు పెట్టడానికి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అబద్ధాలు చెప్పే ఉద్యోగులను పట్టుకోవడానికీ ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి వాయిస్ ఆధారంగా అనారోగ్యాన్ని గుర్తించడానికి AIని ఉపయోగించడం అనేది మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. ఈ ప్రత్యేక అధ్యయనం వాయిస్ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చనే విషయాన్ని తెలియజేస్తోంది. ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే డాక్టర్ వద్దకు వెళ్లకుండానే వాయిస్ ద్వారా అనారోగ్యం గురించి తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu