Ad Code

కొందరు సెలబ్రిటీలకు ట్విట్టర్‌ బ్లూ టిక్‌ ఉచితం !


ఒకప్పుడు ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌లు వార్తల్లో ఉండేవి. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ట్విట్టర్‌ తీసుకుంటున్న చర్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా మరోసారి ట్విట్టర్‌ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ చర్చనీయాంశం అయింది. ఈ పెయిడ్‌ సర్వీస్‌ సబ్‌స్క్రైబ్ చేసుకోని ప్రముఖులు, సంస్థల అకౌంట్ల నుంచి ఏప్రిల్‌ 20న గురువారం ట్విట్టర్‌ బ్లూ టిక్‌లను రిమూవ్‌ చేసింది. అయితే శుక్రవారం, ట్విట్టర్ సీఈవో ఎలాన్‌ మస్క్ ట్విట్టర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌కి ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించిన కొంతమంది ప్రముఖుల కోసం ఆ మొత్తాన్ని వ్యక్తిగతంగా తాను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌ అంతటితో ఆగకుండా సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నట్లు కొంత మంది ప్రముఖల పేర్లను కూడా మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఇందులో షాట్నర్, లెబ్రాన్, స్టీఫెన్ కింగ్ ఉన్నారు. వాస్తవానికి స్టీఫెన్ కింగ్ అనే అమెరికన్ నవలా రచయిత తాను ట్విట్టర్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోకపోయినా, ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రైబ్‌ అయినట్లు ఎలా సూచిస్తోందో ? అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాతనే కొంతమంది ప్రముఖుల ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లకు మస్క్‌ వ్యక్తిగతంగా మనీ చెల్లిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ఒరిజినల్‌, ఫేక్‌ అకౌంట్‌ల మధ్య తేడాను గుర్తించడానికి ట్విట్టర్ 2009లో బ్లూ చెక్‌మార్క్ సిస్టమ్‌ను ప్రారంభించింది. అప్పట్లో ప్రముఖులతో సహా ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు దీనికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ట్విట్టర్‌ బ్లూ టిక్‌ పెయిడ్‌ సర్వీస్‌ అని చాలా నెలల క్రితమే ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేవలు పొందడానికి నెలకు దాదాపు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ట్విట్టర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్యను పెంచేందుకు, పేమెంట్‌లు చేసిన వారికి మాత్రమే లెగసీ వెరిఫైడ్ చెక్‌మార్క్స్‌ పరిమితం చేస్తున్నట్లు ట్విట్టర్ గురువారం ప్రకటించింది. సబ్‌స్క్రైబ్‌ చేయని సంస్థలు, వ్యక్తుల అకౌంట్‌ల నుంచి బ్లూ వెరిఫికేషన్‌ చెక్‌ మార్క్‌లను తొలగించింది. అయితే చాలామంది సెలబ్రిటీలు ఈ సర్వీస్‌ పొందేందుకు ఆసక్తి చూపడం లేదని బహిరంగంగా ప్రకటించారు. కానీ కొందరు మాత్రం సబ్‌స్క్రైబ్‌ చేసుకోకపోయినా గురువారం బ్లూ టిక్‌ తొలగిపోలేదు.


Post a Comment

0 Comments

Close Menu