Ad Code

శాంసంగ్ కంపెనీలో బోర్డు సభ్యుల వేతన పెంపుపై ఆంక్షలు !


ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు.. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌ను కూడా తాకాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కీలకమైన చిప్‌ల సరఫరా అద్వాన్నంగా మారడంతోపాటు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు సగటున 4.1 శాతం మాత్రమే పెంచుతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. పనితీరు వైఫల్యం వల్ల బోర్డు సభ్యుల వేతనాల పెంపు పరిమితి విధించింది. శాంసంగ్‌లో గతేడాది ఉద్యోగుల వేతనాలు తొమ్మిది శాతం పెరిగాయి. అంతే కాదు గత దశాబ్ది కాలంలోనే ఇది గరిష్టం. ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలన్న డిమాండ్ కంటే తక్కువగా శాంసంగ్ సగటున ఉద్యోగుల వేతనాలు 4.1 శాతం పెంచేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఉద్యోగుల వేతనాల పెంపు, ఇతర కార్మిక విధానాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒప్పందం కుదిరింది. మహిళా ఉద్యోగుల్లో గర్భవతుల పని గంటల తగ్గింపు విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సంస్థ లాభాలు 96 శాతం తగ్గిపోవడంతో వేతనాల పెంపు, ఇతర విధానాలపై ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. బోర్డు సభ్యులకు గతేడాది వేతన ప్యాకేజీ విధానం అమలు చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. గరిష్టంగా 17 శాతం వేతనం మాత్రమే పెంచాలని పరిమితి విధించింది. శాంసంగ్‌లో పని చేస్తున్న 1.10 లక్షల మందిలో నాలుగు శాతం మంది యూనియన్ సభ్యులుగా ఉన్నారు. వారి వేతన పెంపు ఒప్పందంపై గతేడాది నుంచి సంప్రదింపులు జరిపినా విభేదాలు పరిష్కారం కాలేదు. చిప్‌ల కొరత వల్ల తొలి త్రైమాసికం లాభాలు 96 శాతం పతనమైన నేపథ్యంలో స్వల్పకాలికంగా చిప్‌ల తయారీ లక్ష్యాలు కుదించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మెమొరీ చిప్, స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన శాంసంగ్.. జనవరి-మార్చి మధ్య కేవలం 454.9 (600 బిలియన్ వూన్‌లు) మిలియన్ డాలర్ల నిర్వహణ లాభాలు గడించింది. ఏడాది క్రితం 14.12 లక్షల కోట్ల వూన్‌ల నిర్వహణ లాభం గడించింది.

Post a Comment

0 Comments

Close Menu