Ad Code

పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్‌ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం !


ఆంధ్రప్రదేశ్‌ లో పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్‌ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అయినా, 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. అయితే, ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఊహించలేమన్నారు. జగన్ ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమిపై స్పందించిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది.. ప్రజలది తప్పనీ అనలేం, మేం మారాలి అన్నారు. అయితే, హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం అని గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో మేం చేసిన అభివృద్ధిని మేమే చెప్పుకోలేదన్నారు. అసలు, తెలంగాణ పేరు మార్చడం (టీఆర్ఎస్‌ ను బీఆర్ఎస్‌గా) వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదు అని మండిపడ్డారు.. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu