Ad Code

విశాఖకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి రాక !


భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ రేపు స్టీల్ ప్లాంట్ విజిట్ తర్వాత ఉక్కు యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆర్థిక నష్టాలు, ముడి ఖనిజాల సరఫరా, శాశ్వత గనులు లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా మంత్రులు పరిశీలించనున్నారు. ఆర్ఐఎన్ఎల్ ప్రయివేటీకరణ ప్రకటన తర్వాత తొలిసారి స్టీల్‌ ప్లాంట్ కు కేంద్ర స్టీల్ శాఖ మంత్రులు వస్తుండడంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదనలను కూటమి ఎంపీలు కేంద్రం ముందు పెట్టారు. మరోవైపు మంత్రులు రాకకు ముందు సీఎండీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్, యునియన్ నాయకులు పాల్గొన్నారు. మరోవైపు, కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి గత వారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్‌ఎన్‌ఐఎల్) ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించిన విషయం విదితమే. అంతేకాకుండా కంపెనీకి ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్లాంట్‌ను లాభసాటిగా మార్చడంతోపాటు సంస్థకు ఆర్థికంగా పునరుత్తేజం కల్పించేందుకు కంపెనీ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను ఉక్కు ఉత్పత్తిని పెంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి, కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక స్థితి, ఉత్పత్తి మరియు కొత్త కార్యక్రమాల గురించి అధికారుల నుండి సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. ఉత్పత్తి, సామర్థ్యం పెంపుపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ సంస్థ అధికారులను ఆదేశించిన మంత్రి, కంపెనీకి ఆర్థిక సహకారం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఏటా 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించిన విషయం విదితమే. కానీ, ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ పరిశీలనకు రావడం ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu