Ad Code

యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా


వొడాఫోన్ ఐడియా తమ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్యలో 30.6 లక్షల మంది తగ్గారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా, వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది. జియో సెప్టెంబర్ నెలలో 7.2 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంది. మార్కెట్ లో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. భారతీ ఎయిర్ టెల్ కూడా తన వినియోగదారుల సంఖ్యను మరో 4.12 లక్షలకు పెంచుకుంది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్నప్పటికీ ఆగస్టు నెలలో 32.81 లక్షల సబ్‌స్క్రైబర్‌ల కన్నా ఇది చాలా తక్కువ. ఇక వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య పడిపోయింది. ఏకంగా 40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు తగ్గారు. మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 114.9 కోట్లు ఉంటే సెప్టెంబర్ చివరినాటికి 114.54కు తగ్గిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. మొత్తం మీద భారతదేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ( మొబైల్, బ్రాడ్ బ్యాండ్, టెలిఫోన్) సెప్టెంబర్ 2022 చివరి నాటికి దాదాపుగా 117.19 కోట్లకు తగ్గింది. మొత్తంగా 0.27 శాతం నెలవారీ క్షీణత నమోదు అయింది. ఇక సెప్టెంబర్ 2022 చివరి నాటికి మొత్తం బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 81.6 కోట్లకు పెరిగిందని, నెలవారీ వృద్ధి రేటు 0.28 శాతంగా ఉందని ట్రాయ్ వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి ఇండియాలో 41.9 కోట్ల వినియోగదారులతో రిలియన్స్ జియో మొదటిస్థానంలో ఉండగా.. 36.4 కోట్లతో ఎయిర్ టెల్ రెండో స్థానంలో, 24.9 కోట్లతో వొడాఫొన్ మూడోస్థానంలో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu