Ad Code

ప్లే స్టోర్ నుంచి 3,500 పైగా లోన్ యాప్స్‌ తొలగింపు !


భారత ప్రభుత్వం, ఆర్బీఐ సూచనలతో టెక్ దిగ్గజం గూగుల్‌ స్పందించి తమ యాప్ స్టోర్‌లో అక్రమ రుణాల ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం తెలిపింది. 2022లోనే 1.73 లక్షల 'బ్యాడ్‌ అకౌంట్స్‌'ను నిషేధించినట్లు గూగుల్ వెల్లడించింది. గత ఏడాది 14.3 లక్షల పాలసీ-ఉల్లంఘించే యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో లిస్ట్‌ కాకుండా నిరోధించింది. దీంతో 2 బిలియన్ల డాలర్ల విలువైన మోసపూరిత, దుర్వినియోగ లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించింది. ప్లే స్టోర్ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘించినందుకు గూగుల్ 2022లోనే ఇండియన్ యాప్ మార్కెట్ ప్లేస్ నుంచి 3,500కి పైగా డిజిటల్ లెండింగ్ యాప్‌లను తొలగించింది. ఇటీవల గూగుల్‌ తన ప్లే స్టోర్ పాలసీని పునరుద్ధరించింది. కాంటాక్ట్‌లు, ఫోటోలు, కాల్ లాగ్స్, లొకేషన్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా రుణాలు ఇచ్చే యాప్‌లను నిషేధించే కఠినమైన గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్లే స్టోర్‌లో లిస్టింగ్ కోసం ఆమోదం పొందడానికి ఈ కఠినమైన గైడ్‌లైన్స్‌ తప్పనిసరిగా పాటించాలి. సేవలు ప్రారంభించడానికి తప్పనిసరిగా RBI లైసెన్స్‌ను అందించాలి. ఈ విధానాలు 2023 మే 31 నుంచి అమల్లోకి వస్తాయి. గత కొన్నేళ్లుగా డిజిటల్ లెండింగ్ మార్కెట్ భారీ వృద్ధిని సాధించింది. 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.18,537 కోట్ల విలువైన 1.8 కోట్ల పంపిణీలు జరిగాయి. అయినప్పటికీ లెండింగ్‌టెక్ స్టార్టప్‌లు భారీగా పుట్టుకొచ్చాయి, మోసపూరిత పద్ధతులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం, ఆర్బీఐ జోక్యం అనివార్యమైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద రుణం ఇచ్చే యాప్ ఆపరేటర్ల నుంచి రూ.106 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. అక్రమ రుణాలు ఇచ్చే ప్లాట్‌ఫామ్‌లు, వాటి అనైతిక పద్ధతులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్‌ చర్యలు మేలు చేస్తాయని భావిస్తున్నారు. లోన్ యాప్‌లకు సంబంధించి ఆత్మహత్యలు, వేధింపుల గురించి అనేక నివేదికలు వచ్చాయి. మహిళలను కూడా కలెక్షన్ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, బంధువులకు ఫార్వార్డ్‌ చేయడం వంటివి చేస్తున్నారు. డబ్బు రికవరీ కోసం లోన్‌ యాప్‌ ఏజెంట్లు మితిమీరి వ్యవహరిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu