Ad Code

పిట్ట స్థానంలో కుక్క లోగో !


టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. వాటికి అంతు అనేదే ఉండట్లేదు. ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఎలాన్ మస్క్.. అందులో పెను సంస్కరణలకు తెర తీశారు. ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోన్నారు. తాజాగా ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ లోగోను మార్చేశారు. బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఇమేజ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. క్రిప్టోకరెన్సీలో ఒకటైన డోజ్‌కాయిన్‌ లోగోగా వినియోగించే శునకం ఫొటో అది. సాధారణంగా నెటిజన్లు మీమ్స్ సృష్టించడానికి ఈ డోజ్‌కాయిన్ డాగ్ ఫొటోను వాడుతుంటారు. ఇప్పుడదే ట్విట్టర్ లోగోగా మారింది. యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, రీఫ్రెష్ చేయగానే కొత్త లోగో దర్శనం ఇస్తోందిప్పుడు. ప్రస్తుతానికి వెబ్‌వర్షన్‌కు మాత్రమే ట్విట్టర్ లోగో ఛేంజ్ అయింది. దశలవారీగా అన్ని వర్షన్‌లకూ ఇది అమలవుతుంది. డోజ్ కాయిన్ లోగోగా షిబా ఇను అనే జాగిలం ఫొటోను వినియోగిస్తోన్నారు. 2013 నుంచీ ఇదే లోగో కొనసాగుతోంది. షిబా ఇను అనేది హంటింగ్ బ్రీడ్‌. జపాన్‌కు చెందిన హంటింగ్ బ్రీడ్ జాగిలం ఇది. నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లకు.. ఈ షిబా ఇను జాగిలం మీమ్స్ చిరపరిచితమే. అది నచ్చడం వల్లే తాను కూడా ట్విట్టర్ బ్లూబర్డ్ లోగోకు బదులుగా డోజ్ కాయిన్ షిబా ఇను డాగ్ ఫొటోను వాడినట్లు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చాడు. ఇదివరకు కూడా ఇదే డోజ్ కాయిన్ డాగ్ లోగోను ఒకట్రెండు సందర్భాల్లో ఎలాన్ మస్క్ వినియోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుర్చీలో డోజ్ కాయిన్ డాగ్ మీమ్‌ను ఉంచి కొత్త సీఈఓ వచ్చాడంటూ ప్రచారం చేశారాయన. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు 258 బిలియన్ డాలర్ల మేర న్యాయపరమైన వివాదాలను కూడా డోజ్ కాయిన్ క్రిప్టొకరెన్సీ నుంచి ఎదుర్కొన్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించారు. ట్విట్టర్ వినియోగదారులకు వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఎలాంటి పోస్టులనైనా పెట్టొచ్చని పేర్కొన్న ఆయన నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండబోదని తేల్చి చెప్పారు. నెగెటివిటీ/హేట్ స్పీచ్ వంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయబోమని స్పష్టం చేశారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu