Ad Code

దేశంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు !


2030 నాటికి క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 12.7 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016-2022 మధ్య కాలంలో చేసిన 3.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 30,900 కోట్లు) కూడా కలిపితే దీర్ఘకాలంలో 2030 నాటికి తమ పెట్టుబడులు 16.4 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 1,36,500 కోట్లు) చేరినట్లవుతుందని ఏడబ్ల్యూఎస్‌ పేర్కొంది. డేటా సెంటర్‌ మౌలిక సదుపాయాలపై కొత్త ప్రతిపాదిత పెట్టుబడులతో భారతీయ వ్యాపార సంస్థల్లో ఏటా సగటున 1,31,700 పూర్తి స్థాయి కొలువులకు సరిసమానమైన ఉద్యోగాల కల్పన జరగగలదని వివరించింది. నిర్మాణం, ఫెసిలిటీ మెయింటెనెన్స్, ఇంజినీరింగ్, టెలీకమ్యూనికేషన్స్‌ మొదలైన విభాగాల్లో ఇవి ఉండగలవని ఏడబ్ల్యూఎస్‌ పేర్కొంది. ఏడబ్ల్యూఎస్‌కు భారత్‌లో రెండు డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రా రీజియన్లు ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్‌ ఏషియా పసిఫిక్‌ రీజియన్‌లను 2016లో ముంబైలో ఒకటి, 2022లో హైదరాబాద్‌లో మరొకటి ప్రారంభించింది. వ్యయాలు తగ్గించుకునేందుకు, నవకల్పనలను వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు, మార్కెట్‌ను సత్వరం అందిపుచ్చుకునేందుకు దేశీయంగా వేలకొద్దీ క్లయింట్లు తమ సేవలను ఉపయోగిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పునీత్‌ చందోక్‌ చెప్పారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మొదలుకుని అశోక్‌ లేల్యాండ్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజాలు, ఇతరత్రా స్టార్టప్‌లు మొదలైనవెన్నో వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu