Ad Code

సముద్ర గర్భంలో 7000 ఏళ్ల నాటి రహస్య రహదారి !

పురావస్తు శాస్త్రవేత్తలు మధ్యధరా సముద్ర ఉపరితలం నుంచి 16 అడుగుల దిగువన 13 అడుగుల వెడల్పు గల చారిత్రక రహదారిని కనుగొన్నారు. పురాతన హవార్ సంస్కృతికి సంబంధించిన వ్యక్తులు ఈ రహదారిని నిర్మించారని వారు నమ్ముతున్నారు. ఈ మునిగిపోయిన నియోలిథిక్ ప్రదేశం  క్రొయేషియా ద్వీపం కోర్కులాతో కలుస్తుందని వారు అంచనా వేస్తున్నారు. నీటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ రహదారి ఫొటోలు, వీడియో క్లిప్‌లను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. సముద్రం కింద 7,000 సంవత్సరాల పురాతన రోడ్డును కనుక్కున్నాం అని ఫొటో క్యాప్షన్‌లో తెలిపారు. కోర్కులా ఒకప్పుడు క్రొయేషియా ప్రధాన భూభాగానికి ఆనుకొని ఉండేది. మంచు యుగం చివర్లో సముద్ర మట్టం పెరగడంతో ఈ రహదారి మునిగిపోయింది. ఈ ద్వీపం సుమారు 8,000 సంవత్సరాల కిందట ఏర్పడిందని అంటున్నారు. రాళ్లతో నిర్మించిన ఈ రహదారి నిర్మాణ తేదీని నిర్ణయించడానికి శాస్త్రవేత్తల బృందం రేడియోకార్బన్ పరీక్షలు చేసింది. క్రీస్తు పూర్వం 4,900 నాటిదిగా తేలింది. ఈ ప్రాంతంలోని పురాతన స్థావరాలలో ఇది ఒకటిగా నిలిచింది. అనేక సంస్థలు, కంపెనీలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ రహదారిని కనుక్కుంది. జదర్ యూనివర్సిటీకి చెందిన మాతా పరిక ఈ టీమ్‌కి నాయకత్వం వహించింది. ఈ బృందంలో మ్యూజియం ఆఫ్ డుబ్రోవ్నిక్, సిటీ మ్యూజియం ఆఫ్ కోర్కులా, సిటీ మ్యూజియం ఆఫ్ కాస్టెలాకి చెందిన పరిశోధకులు ఉన్నారు. ఈ రహదారిని బట్టీ  హవార్ సంస్కృతి చాలా అభివృద్ధి చెందినదనీ, ఆకట్టుకునే నిర్మాణాలను నిర్మించిందని అర్థమవుతోంది. హవార్ సంస్కృతికి చెందిన చాలా మంది రైతులు, పశువుల కాపరులు సముద్ర తీరానికి దగ్గర్లో నివసించారు. ఇతర సంస్కృతులకు చెందిన ప్రజలు కూడా ద్వీపం చుట్టూ నివసించారు. వారే ఈ రోడ్డును నిర్మించుకొని ఉంటారని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu