Ad Code

మనుషుల మెదడుపై ఇంప్లాట్స్‌ టెస్ట్‌కు న్యూరాలింక్ కంపెనీకి అనుమతులు !

మెదడుకు సంబంధించిన వ్యాధులను సమర్థంగా నయం చేసేందుకు బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీని ఎలాన్‌ మస్క్‌ కంపెనీ న్యూరాలింక్‌ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యూరాలింక్ తన మొదటి హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్ కోసం యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం పొందింది. దీంతో మానవులపై న్యూరాలింక్‌ బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీని టెస్ట్‌ చేయడానికి రూట్ క్లియర్‌ అయింది. న్యూరాలింక్‌ కంపెనీకి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే గతంలో ఈ ఆమోదం కోసం సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చాలా మందికి సహాయం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన మొదటి అడుగు అని న్యూరాలింక్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదంపై ఆనందం వ్యక్తం చేసింది. అయితే రిక్రూట్‌మెంట్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి, అధ్యయనం గురించి నిర్దిష్ట వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరింత సమాచారం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బ్రెయిన్‌ ఇంప్లాంట్స్‌ వివిధ కండిషన్లను అడ్రస్‌ చేయగలవని, వెబ్ బ్రౌజింగ్, టెలిపతి వంటి ఫంక్షన్స్‌ను ఎనేబుల్‌ చేయగలవని ఎలాన్‌ మస్క్ గతంలో పేర్కొన్నారు. ఆయన డివైజెస్‌ సేఫ్టీపై విశ్వాసం వ్యక్తం చేశారు. వాటిని తన సొంత పిల్లలకు కూడా అమర్చడానికి సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి భయాలు అవసరం లేదని ప్రకటించారు. 2022 సంవత్సరం ప్రారంభంలో న్యూరాలింక్‌ కంపెనీ FDA అనుమతిని కోరింది. అయితే హ్యూమన్‌ టెస్ట్‌ల వైపు న్యూరాలింక్ ప్రయాణానికి కొంత సమయం పట్టింది. డివైజ్‌లో పొందుపరిచిన లిథియం బ్యాటరీ, బ్రెయిన్‌లోని వైర్ మూవ్‌మెంట్స్‌, మెదడు కణజాలం దెబ్బతినకుండా సురక్షితంగా వెలికితీసే విషయంలో FDA వివిధ ప్రశ్నలు లేవనెత్తింది. ఆమోదం పొందడానికి ముందు ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఎట్టకేలకు సవాళ్లను అధిగమించిన న్యూరాలింక్‌ FDA ఆమోదం అందుకుంది. 2016లో న్యూరాలింక్ కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్స్‌కి సబ్జెక్ట్‌గా మారింది. న్యూరాలింక్‌లో యానిమల్‌ టెస్టింగ్‌ను పర్యవేక్షిస్తున్న ప్యానెల్‌ను పరిశీలించాలని, దాని కంపొజిషన్‌, పొటెన్షియల్‌ రష్డ్‌ ఎక్స్‌పరిమెంట్స్‌ను ప్రశ్నించాలని చట్టసభ సభ్యులు కోరారు. సరైన నియంత్రణ చర్యలు లేకుండా న్యూరాలింక్ ప్రమాదకర వ్యాధికారకాలను చట్టవిరుద్ధంగా రవాణా చేసిందా? లేదా? అనే అంశాలను కూడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ దర్యాప్తు చేస్తోంది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పొటెన్షియల్‌ యానిమల్ వెల్ఫేర్‌ వయోలేషన్స్‌, కంపెనీపై USDA పర్యవేక్షణపై విచారణను నిర్వహిస్తోంది. బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా బ్రెయిన్‌లో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు లేదా ఇంప్లాంట్స్‌ ఉంచుతారు. న్యూరల్ సర్క్యూట్‌లతో ఇంటరాక్ట్‌ కావడానికి, బ్రెయిన్‌ ఫంక్షన్స్‌ని మెరుగుపరచడానికి లేదా పునరుద్ధరించడానికి ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. ఈ ఇంప్లాట్స్‌ను బ్రెయిన్‌ ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌తో ఇంటర్‌ఫేస్ అయ్యేలా రూపొందిస్తారు. దీనితో బ్రెయిన్‌, ఎక్స్‌టెర్నల్‌ డివైజ్‌లు లేదా కంప్యూటర్ సిస్టమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ సాధ్యమవుతుంది. బ్రెయిన్‌ ఫంక్షన్స్‌ను నేరుగా ప్రభావితం చేయడం ద్వారా వివిధ నాడీ సంబంధిత పరిస్థితులు లేదా వైకల్యాలకు చికిత్స చేయడం బ్రెయిన్-ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఇది పార్కిన్సన్స్ వ్యాధి, మూర్ఛ, పక్షవాతం వంటి వివిధ రోగాలను సమర్థంగా నయం చేయగలదు.

Post a Comment

0 Comments

Close Menu