Ad Code

ఏఐ ముప్పుపై చర్చించేందుకు కమలా హ్యారిస్‌తో భేటీ !


చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ బింగ్, గూగుల్ బార్డ్‌ వంటి ఏఐ జనరేటివ్ టూల్స్ ప్రాచుర్యం పొందుతున్న క్రమంలో టెక్ ప్రపంచంలో ఈ టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. ఈ టెక్నాలజీల దుర్వినియోగం, కొలువుల కోత సహా ఏఐ టూల్స్‌తో ఎదురయ్యే పెనుముప్పులపైనా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ టూల్స్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలపై చర్చించేందుకు టెక్ దిగ్గజాలు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో భేటీ అయ్యేందుకు సన్నద్ధమయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌, ఓపెన్ఏఐ అధిపతి శామ్ అల్ట్‌మాన్ సహా పలువురు టెక్ దిగ్గజాలు కమలా హ్యారిస్‌తో పాటు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు టెక్ కంపెనీల ఉత్పత్తులు ప్రజా బాహుళ్యంలోకి వెళ్లేముందు అవి సురక్షితమైనవిగా ఉండేలా చూసేందుకు టెక్ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వారిని ఆహ్వానించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏఐ పరిశోధనను ఈ ఏడాది నిలిపివేయాలని టెక్ దిగ్గజాలు ఎలన్ మస్క్‌, యాపిల్ సహ వ్యవస్ధాపకులు స్టీవ్ వోజ్నిక్ వంటి టెక్ అధిపతులు లేఖ రాసిన క్రమంలో ఏఐపై అత్యున్నత స్ధాయిలో చర్చ ఊపందుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, టెక్ సీఈవోల మధ్య గురువారం సమావేశం జరగనుందని సమాచారం. ఈ భేటీకి బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జింట్స్‌, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బ్రూస్ రీడ్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్‌, జాతీయ ఆర్ధిక మండలి డైరెక్టర్ లేల్ బ్రినార్డ్‌, వాణిజ్య మంత్రి గినా రైమండో తదితరులు హాజరవుతారు. ఏఐపై నియంత్రణల గురించి కూడా అమెరికన్ అధికారులతో టెక్ సీఈవోలు చర్చిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu