Ad Code

అందుబాటులోకి గూగుల్ బార్డ్‌ !


గూగుల్‌ ఈ ఏడాది మార్చిలో AI బార్డ్‌ను విడుదల చేసింది. ఈనెల 10వ తేదీ వరకు యూకే, అమెరికాల్లోనే బార్డ్‌ అందుబాటులో ఉండేది. ప్రస్తుతం భారత్‌ సహా 180 దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అదనపు ఫీచర్లను బార్డ్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే గూగుల్‌ బార్డ్ ప్రత్యేకతలు ఏంటి, ChatGPT కంటే గూగుల్‌ చాట్‌బోట్‌ మెరుగ్గా పనిచేయగలదా మరియు ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. చాట్‌జీపీటీ మాదిరిగా గూగుల్‌ బార్డ్‌ కూడా లాగ్వేజ్ మోడల్‌. దీన్ని చాట్‌బోట్‌ అని కూడా పిలుస్తారు. బార్డ్‌.. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ డేటాపై శిక్షణ పొందింది. అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. గూగుల్‌ బార్డ్‌ అనేక విభిన్నమైన పనులు చేసేందుకు వినియోగించుకోవచ్చు. ప్రశ్నలకు సమాధానాలివ్వడం, టెక్ట్స్‌ కంటెంట్‌ను జెనరేటివ్‌ క్రియేటివ్‌ కంటెంట్‌గా మార్చడం, వివిధ భాషల్లోకి అనువదించడం, కోడింగ్‌ రాయడం, డీబగ్గింగ్‌ చేయడం, కోడింగ్‌పై వివరణ ఇవ్వడం సహా మరెన్నింటినో బార్డ్‌ చేయగలదు. అలాగే బార్డ్‌ ఏఐ చేసే చాలా పనులను చాట్‌జీపీటీ కూడా చేయగలదు. అయితే చాట్‌జీపీటీ కంటే బార్డ్‌ మరిన్ని పనులు చేయగలదు. మీరు ఏదైనా సమాధానం కోసం గూగుల్‌ బార్డ్‌ను వినియోగిస్తే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని విశ్లేషించి, సమాధానం ఇస్తుంది. ఈ ఫీచర్‌ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే తాజా సమాచారం కోసం బార్డ్‌ను వినియోగించవచ్చు. గూగుల్‌ బార్డ్‌లో ఇంకో సౌకర్యం కూడా ఉంది. వాయిస్‌ ఇన్‌పుట్‌తోనూ ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏదైనా సమాధానం కావాలంటే సులభంగా వాయిస్‌ రూపంలో ఇన్‌పుట్ ఇస్తే సరిపోతుంది. వినియోగదారులు పెద్ద పెద్ద వాయిస్‌ ఇన్‌పుట్ కూడా ఇవ్వొచ్చు. అంతే కాకుండా గూగుల్‌ బార్డ్‌ టెక్ట్స్‌ను PDF, వర్డ్‌, HTML వంటి రూపాల్లో ఇవ్వగలదు. ఫలితంగా పనిని ఇతరులతో పంచుకోవడం సహా ఇతర అప్లికేషన్లు వినియోగించిన సమయాల్లో ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. మీకు బార్డ్‌ AI ఇచ్చిన సమాధానాన్ని పీడీఎఫ్‌ లేదా Wordలోకి మార్చుకొని, ఎక్స్‌ఫోర్ట్‌ చేసుకోవచ్చు. బార్డ్‌ ఇచ్చిన సమాధానాన్ని HTML ఫైల్‌లోకి కూడా మార్చుకోవచ్చు. అనేక వెబ్‌ పేజీల సారాంశాన్ని తక్కువ సమయంలో బార్డ్‌ సులభంగా అందిస్తుంది. బార్డ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి URLని ఇన్‌పుట్‌గా ఇవ్వడం ద్వారా.. మీకు కావాల్సిన సమాధానం యొక్క సారాంశాన్ని పొందవచ్చు. మనకు కావాల్సిన విధంగా సమాధానాన్ని పొందవచ్చు. అంటే ఎన్ని పదాల్లో సమాధానం కావాలన్నా బార్డ్‌ అందిస్తుంది. బార్డ్‌ AI ఒక ప్రశ్నకు అనేక డ్రాఫ్ట్‌లను సమాధానంగా ఇస్తుంది. అందులో నుంచి మీకు నచ్చినదానిని ఎంచుకోవచ్చు. ఒకదానికొకటి సరిపోల్చుకొని.. మీకు కావాల్సిన సమాధానాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా కావాల్సిన విధంగా ఎడిట్‌ చేసుకోవచ్చు. గూగుల్ బార్డ్ AI తో మరో మంచి ఉపయోగం ఉంది. బార్డ్‌ ప్రోగ్రామింగ్ కోడ్‌లను వివరించగలదు. ఎవరైతే కోడింగ్‌ నేర్చుకుంటున్నారో వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడనుంది. మీకు ఏదైనా కోడింగ్‌ సరిగ్గా అర్థం కాకపోతే.. ఆ కోడ్‌ బార్డ్‌కు ఇన్‌పుట్‌ రూపంలో అందిస్తే.. మీకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించగలదు. అంతేకాకుండా ఆ కోడ్‌ ఎలా పనిచేస్తుంది.. కోడ్‌ ఏంటి వంటి సమాధానాలను కూడా బార్డ్ నుంచి రాబట్టవచ్చు. ఏదైనా ఒక అంశంపై అదనపు సమాచారం కోసం.. బార్డ్‌ గూగుల్‌ సెర్చ్‌ను మరింత ముందుకు వెళ్లమని సూచిస్తుంది. బార్డ్‌లో.. ప్రశ్న తర్వాత "Suggest" అనే పదం టైప్‌ చేయవచ్చు. దాని వల్ల మీకు కావాల్సిన సమాచారం యొక్క లిస్ట్‌ అంతా ఒకే చోట కనిపిస్తుంది. అక్కడొచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేసి మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. బార్డ్‌లో మరో ముఖ్యమైన ఫీచర్‌ ఉంది. మీరు ఎక్కడికైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నప్పుడు.. బార్డ్‌ మీకు సాయం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా.. ఎక్కడకు మరియు ఎప్పుడు వెళ్తున్నారో బార్డ్‌కు ఇన్‌పుట్‌ ఇవ్వడమే. దాంతో బార్డ్‌ మీకు ప్లాన్‌ చేసి ఇస్తుంది. మీకు ఇటువంటి ఫీచరే ChatGPT లోనూ ఉంది. కాకపోతే చాట్‌జీపీటీ కేవలం 2021 సెప్టెంబర్‌ వరకు ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే సమాధానం ఇస్తుంది. బార్డ్ మాత్రం ఇంటర్నెట్‌లో ఉన్న తాజా సమాచారం ఆధారంగా అనేక సలహాలు ఇస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu