Ad Code

తెలంగాణలో మెడ్‌ట్రానిక్స్‌ భారీ పెట్టుబడి !


తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో మెడికల్‌ డివైజెస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు తో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ ను గ్లోబల్ లీడర్ గా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములం అవుతున్నందకు సంతోషంగా ఉందన్నారు మెడ్‌ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & ప్రెసిడెంట్ మైక్ మరీనా. మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్కరణలకు భారతదేశం నయా గమ్యస్థానంగా మారిందన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగం లో హైదరాబాద్ ప్రాధాన్యతను గుర్తించినంకనే తాము ఈ పెట్టుబడి ప్రకటన చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందకు గర్వంగా ఉందని మైక్ మరీనా చెప్పారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం అన్నారు మెడ్‌ట్రానిక్స్‌ వైస్ ప్రెసిడెంట్ & సైట్ లీడర్ దివ్య ప్రకాష్ జోషి. హెల్త్‌కేర్ టెక్నాలజీలో ఆవిష్కరణలు, పురోగతికి R&Dలో తాము పెడుతున్న పెట్టుబడి పునాది అవుతుందన్న నమ్మకాన్ని దివ్య వ్యక్తం చేశారు. వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమైన మార్కెట్ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి కేటీఆర్ . లైఫ్ సైన్సెస్ రంగంలో తమ పోటీ ప్రపంచంతోనే అన్నారు. లైఫ్ సైన్సెస్,హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ కు ఉన్న పట్టుకు, పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్ తాజా పెట్టుబడే నిదర్శనమన్నారు. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగం వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు మెడ్‌ట్రానిక్స్‌ విస్తరణ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ CEO శక్తి ఎం నాగప్పన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో మెడ్‌ట్రానిక్ ప్రధాన కార్యాలయం ఉంది. 150 కంటే ఎక్కువ దేశాలలో 90 వేలకు పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu