Ad Code

ఆకలిని నియంత్రించే క్యాప్సూల్ ?


వైద్య చరిత్రలో మరో సరికొత్త ఆవిష్కరణ జరిగింది. ఆకలిని నియంత్రించే క్యాప్సూల్‌ని పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఆకలిని కంట్రోల్‌లో ఉంచడానికి హానికర విధానాలను అవలంబించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఈ సమస్య ఉండబోదు. శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఆకలిని నియంత్రించేలా పరిశోధకులు క్యాప్సూల్‌ని తయారు చేశారు. సమీప భవిష్యత్తులోనే ఈ క్యాప్సూల్‌ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అబుదాబిలోని ఎన్‌వై యూనివర్సిటీ పరిశోధకుల బృందం తొలి సారిగా ఈ క్యాప్సూల్‌ని తయారు చేసింది. సాధారణంగా మనకు ఆకలి వేస్తే మెదడు సిగ్నల్స్ పంపుతుంది. ఈ సందర్భంగా కొన్ని హార్మోన్‌లను జనరేట్ చేస్తుంది. ఇలా హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రణలో ఉంచేలా మెదడుకు ఈ ఎలక్ట్రోస్యూటికల్ డివైజ్ సూచనలు పంపుతుంది. ఆకలి స్థాయిలను నియంత్రణలో ఉంచడంతో పాటు మెటబాలిక్, న్యూరోలాజికల్ వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ ఆవిష్కరణ మార్గం సుగమం చేయనుంది. మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలతో కలిసి అబుదాబి పరిశోధకులు ఈ క్యాప్సూల్‌ని డెవలప్ చేశారు. దీనికి 'ఫ్లాష్' అని నామకరణం చేశారు. నీటిలో కరిగిపోకుండా ఉండేలా ఈ క్యాప్సూల్‌ ఉపరితలాన్ని డిజైన్ చేశారు. వీటిలో చిన్న పాటు బ్యాటరీలను అమర్చారు. ఇవి 20 నిమిషాల పాటు విద్యుత్‌ని ఉత్పత్తి చేయగలవు. ఇలా రూపొందించిన సర్ఫేస్ గ్యాస్ట్రిక్ ద్రవాన్ని బైపాస్ చేసి నేరుగా కణజాలంతో కాంటాక్ట్ అయ్యేందుకు సహకరిస్తుంది. క్యాప్సూల్ ఉపరితలంపై ఉన్న ఎలక్ట్రోడ్‌లు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్‌ని కలిగిస్తాయి. ఇవి కడుపులో శ్లేష్మ కణజాలాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగపడతాయి. ఫలితంగా మెదడుకు సిగ్నల్స్ అంది.. ఆకలిని కలిగించే గ్రెలిన్ హార్మన్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇలాంటి ఎలక్ట్రోస్యూటికల్స్ న్యూరోహార్మోనల్ సర్క్యూట్స్‌పై కచ్చితమైన ప్రభావం చూపిస్తాయని లాబోరేటో డైరెక్టర్ ప్రొఫసర్ ఖలీల్ రమడి వెల్లడించారు. పేషంట్లకు అసౌకర్యం కలిగించకుండా సురక్షితంగా పని పూర్తి చేసేందుకు ఇలాంటి క్యాప్సూల్స్ ఎంతగానో ఉపయోగ పడతాయని ఆయన వెల్లడించారు. ఒకసారి ఈ క్యాప్సూల్‌ని మింగిన తర్వాత అది స్టమక్‌కి స్టిమ్యులేషన్‌ని డెలివర్ చేస్తుంది. అనంతరం దానంతట అదే శరీరం నుంచి పాయువు ద్వారా బయటకు వెళ్లిపోతుంది. భారీ శరీరం కలిగినవ వారికి ఈ క్యాప్సూల్ విసర్జితం అవడానికి రెండు వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. సైన్స్ రోబోటిక్స్ అనే జర్నల్‌లో ఈ రీసెర్చ్‌ని ప్రచురించారు.

Post a Comment

0 Comments

Close Menu