Ad Code

యాడ్ బ్లాకర్స్‌కు యూట్యూబ్ చెక్ ?


యూట్యూబ్ ను దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ వాడుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అతిపెద్ద యూజర్ బేస్‌తో భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తుంది. క్రియేటర్స్ కూడా బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌తో పాటు క్రియేటర్ల ఆదాయాన్ని యాడ్ బ్లాకర్స్ తగ్గిస్తున్నాయి. యాడ్ బ్లాకర్ అనేది వెబ్‌సైట్లలో ప్రకటనలు కనిపించకుండా చేసే ఒక సాఫ్ట్‌వేర్. ప్రస్తుతం యూట్యూబ్ వెబ్‌సైట్‌లో కూడా యాడ్ బ్లాకర్ పనిచేస్తుంది. దీనివల్ల కంపెనీతో పాటు క్రియేటర్స్‌కి నష్టాలు వస్తున్నాయి. కాబట్టి యాడ్-బ్లాకర్ల వినియోగాన్ని నిషేధించాలని యూట్యూబ్ చూస్తోంది. టెక్ న్యూస్ వెబ్‌సైట్ ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ ప్రకారం, యాడ్ బ్లాకర్ ఎనేబుల్ చేసిన యూజర్లను బ్లాక్ చేసే ఒక పాప్-అప్‌ను యూట్యూబ్ ప్రస్తుతం పరీక్షిస్తోంది. యూట్యూబ్‌లో యాడ్ బ్లాకర్లను అనుమతించమని ఒక వార్నింగ్ లాగా ఈ పాప్-అప్ చెబుతోంది. యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే యూట్యూబ్ ప్రీమియంకి సైన్ అప్ చేయాలంటూ "ట్రై యూట్యూబ్ ప్రీమియం" అనే ఆప్షన్‌ కూడా అందిస్తుంది. బిలియన్ల కొద్దీ యూజర్లు ఫ్రీగా యూట్యూబ్‌ వీడియోలను చూసే వీలును యాడ్స్‌ కల్పిస్తున్నాయనే విషయాన్ని కూడా పాప్-అప్ హైలైట్ చేస్తుంది. యాడ్స్ చూడకూడదనుకునే వారు ప్రీమియం వెర్షన్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని లేదా యాడ్-బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌లో "అలో యూట్యూబ్ యాడ్స్" ఆప్షన్‌ అయినా ఆన్ చేయాలని ఈ పాప్‌-అప్ కోరింది. పాప్-అప్ ఫీచర్‌ను ప్రస్తుతం తక్కువ మంది యూజర్లతో యూట్యూబ్ పరీక్షిస్తోంది. ఇది అందరికీ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. యాడ్ బ్లాకర్లను బ్లాక్ చేయడానికి యూట్యూబ్ పరీక్షిస్తోన్న పాప్-అప్‌ ఒక లిమిటెడ్ టెస్ట్ మాత్రమేనని యూట్యూబ్ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. అయితే యాడ్ బ్లాకర్లను అణిచివేసేందుకు యూట్యూబ్ గట్టిగానే ప్రయత్నిస్తోందని ఈ తాజా పరిణామాల ప్రకారం తెలుస్తోంది. గతంలో యూట్యూబ్ వాన్సడ్ అనే థర్డ్-పార్టీ యూట్యూబ్ క్లయింట్ యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లను ఫ్రీగా ఆఫర్ చేసింది. ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా యాడ్స్ లేకుండా వీడియోలు చూడటం కుదిరింది. కాగా కాపీరైట్ ఉల్లంఘనను కారణంగా చూపుతూ గూగుల్ చివరికి యూట్యూబ్ వాన్‌స్డ్‌ను నిలిపివేసింది. ఆదాయం తగ్గడానికి కారణమైన యాడ్ బ్లాకర్లను తన ప్లాట్‌ఫామ్‌పై బ్యాన్ చేయడమే కాకుండా ప్రీమియం వెర్షన్‌ను ఎక్కువమంది తీసుకునేలా యూట్యూబ్ ప్రోత్సహిస్తోంది. యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్, హై క్వాలిటీ వీడియోల కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని యూజర్లను కోరుతోంది. కొందరికి ప్రీమియం ట్రయల్ వెర్షన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu