Ad Code

గ్రామాలకు కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ !


ఇప్పటివరకు ప్రధాన నగరాలకు మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ మ్యాప్స్‌  స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఇకపై దేశంలోని ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది. దీంతో గూగుల్ యూజర్లు ప్రతి వీధిలోని ప్రతి ఇంటినీ సులువుగా గుర్తించవచ్చు. దీనివల్ల అడ్రస్‌లు వెతుక్కోవడం మరింత ఈజీ అవుతుంది. మనం అడ్రస్ కోసం వెతికే చోట ఉన్న షాపు, ఇల్లు లేదా ఆఫీస్ ను 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. ఒకరకంగా దీన్ని వర్చువల్ ప్రజెంటేషన్‌గా చెప్పొచ్చు. దీంతో యూజర్ ఆ ప్రాంతలో ఉండి.. అక్కడి పరిసరాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటిదాకా గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాల్లో ఈ ఫీచర్ ఎప్పుడో అందుబాటులో ఉన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఈ ఫీచర్‌కి ప్రభుత్వం 2016లో అనుమతులు నిరాకరించింది. 2018లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచగా మరోసారి తిరస్కరణకు గురైంది. స్ట్రీట్ వ్యూ ఫీచర్ పనోరమిక్ ఫొటోలతో నగరాలు, గ్రామాల్లోని వీధులను చూడొచ్చు. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగా స్ట్రీట్ వ్యూ కోసం సేకరించే పనోరమిక్ ఫొటోల్లోని వ్యక్తుల ముఖాలు, వాహనాల నంబర్ ప్లేట్లు వంటి వాటిని కనపడకుండా చేస్తామని తెలిపింది. దీంతో గూగుల్ స్ట్రీట్ వ్యూను ప్రభుత్వం ఆమోదించడంతో గతేడాది ఈ ఫీచర్‌ను గూగుల్ భారత్‌లోని యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.


Post a Comment

0 Comments

Close Menu