Ad Code

అరుదైన గ్రహ శకలం !


అత్యంత అరుదైన  గ్రహ శకలం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పై అంతస్తులోని పైకప్పును చీల్చుకొని పడక గదిలోకి దూసుకొచ్చింది. న్యూజెర్సీ రాజధాని ట్రెంటాన్‌కు ఉత్తరాన ఉన్న హోప్‌వెల్‌ టౌన్‌షిప్‌లో ఇటీవలే మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ శిల వేగానికి పడక గదిలోని కలప గచ్చు కొంత ధ్వంసమయ్యింది. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్‌ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుంది. అదొక లోహాన్ని పోలి ఉండడంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారుల సూచన మేరకు 'ద కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీ' సైంటిస్టులు రంగంలోకి దిగి, ఆ శిలను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. అది కాన్‌డ్రైట్‌ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. బంగాళదుంప పరిమాణంలో 6/4 అంగుళాలు, 2.2 పౌండ్ల (దాదాపు ఒక కిలో) బరువు ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని తెలిపారు. అరుదైన గ్రహ శకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమని ద కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీ ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌ చైర్మన్‌ నాథన్‌ మ్యాగీ చెప్పారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu