Ad Code

'మెమొరీ బైట్స్‌' యాప్‌ ఆవిష్కరణ !


ఐఐటీ మద్రాస్‌ నిపుణులు ఏ చారిత్రక ఫొటోగానీ, వస్తువుగానీ చూపితే వాటి వివరాలు తెలిపే ఒక యాప్‌ను తయారు చేశారు. 500 ఏళ్ల క్రితం వరకూ ఆంగ్లో-ఇండియన్‌ చారిత్రక ఘట్టాలన్నింటినీ యాప్‌లో రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం కొంతవరకు ప్రక్రియ పూర్తయింది. కేంద్రప్రభుత్వ సహకారంతో చేస్తున్న ఈ ప్రాజెక్టును ఆగుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) మాధ్యమంలో డిజిటలీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ యాప్‌ 'మెమొరీబైట్స' పేరుతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్లుగా ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్‌ ఫర్‌ మెమొరీ స్టడీస్‌కు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మెరిన్‌ సిమి రాజ్‌, అవిషేక్‌ పరుయి ఉన్నారు. ఈ యాప్‌ పనితీరు తెలిపేందుకు ఇప్పటికే పలు ఎగ్జిబిషన్లు నిర్వహించారు. చారిత్రక ఆనవాళ్లను ప్రదర్శనకు ఉంచి వీక్షకులకు సమాచారం తెలిసేలా చేశారు. ఆంగ్లో-ఇండియన్‌ చరిత్రలో అప్పటి జీవనవిధానం, వలసలు, రవాణా, వారసత్వం వంటి ఆ ప్రదర్శనల్లో ఉన్నాయి. ఈ యాప్‌ ద్వారా మరో ప్రయోగం చేశారు. గ్రామీణ విద్యార్థులకు ఏఆర్‌, వీఆర్‌ సాధనాల మిశ్రమంగా పాఠాల్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తున్నారు. పలు పాఠశాలల్లో వినియోగించి చూశారు. సెకండరీ పాఠశాలల పిల్లలకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు. సోషల్‌, చరిత్ర, సైన్స్‌, వివిధ భాషలు తదితర సబ్జెక్టుల్ని సులువుగా తెలుసుకునేలా దీన్ని డిజైన్‌ చేశారు. వీఆర్‌ హెడ్‌సెట్‌ను ధరించి పుస్తకాలవైపు చూడగానే అందులోని చిత్రాలు, కామిక్‌లను ఈ యాప్‌ గ్రహించి వీడియోలు, ఆడియో పాఠాలు, కథల రూపంలో కళ్లకు కట్టినట్లు చూపేలా చేశారు. దేశంలోని లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉంటుందని, సీఎస్‌ఆర్‌ నిధుల్ని వినియోగించి వారికి అందించవచ్చని మెరిన్‌ సిమి రాజ్‌ తెలిపారు. దేశంలోని చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఏఆర్‌, వీఆర్‌ సెట్లతో చరిత్రను తెలుసుకునేలా, ఆయా కాలాల్లోనే ఉన్నట్లు అనుభూతి పొందేలా చేయడం ఈ ప్రాజెక్టు మరో లక్ష్యం. ప్రస్తుతం తమిళనాడులోని మహాబలిపురం చారిత్రక స్థలంపై ఈ తరహా ప్రయోగం చేసే దిశగా సాగుతున్నట్లు పరిశోధకులు అవిషేక్‌ పరుయి వివరించారు. ప్రభుత్వ మ్యూజియాల్లో ఉండే పురాతన వస్తువులకూ దీన్ని త్వరలో అన్వయిస్తామని అంటున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu