Ad Code

14 నెలల్లోనే చాట్‌జీపీటీ దివాళా ?


చాట్‌జీపీటీ దాదాపు ఏడాది క్రితం సెర్చింజన్ గూగులమ్మకు పోటీగా వచ్చింది . జాతీయ, అంతర్జాతీయ అంశాలపై 'గూగుల్' కంటే బెటర్‌గా యూజర్లకు కంటెంట్ అందుబాటులోకి తేవడంతో నెటిజన్లు మొదలు సెలబ్రిటీలు, కార్పొరేట్లు, ఒక్కరేమిటి  ప్రతి ఒక్కరి దృష్టిచాట్‌జీపీటీపై మళ్లింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు సైతం చాట్‌జీపీటీ తరహాలో సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌బోట్‌లను అందుబాటులోకి తెచ్చాయి.. మరికొన్ని సంస్థలు ఆ ప్రక్రియలో బిజీబిజీగా గడుపుతున్నాయి.. కానీ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఆర్థిక పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగో లేదట. వచ్చే ఏడాది అంటే 2024లో దివాళా ప్రక్రియకు వెళ్లే అవకాశం ఉందని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ సంచలన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చాట్‌జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ ప్రతి రోజూ సుమారు రూ.5.80 కోట్ల (ఏడు లక్షల డాలర్లు) నష్ట పోతున్నదని ఆ నివేదిక సారాంశం. ఓపెన్ ఏఐ ఆర్థిక వనరులు శరవేగంగా తగ్గిపోయాయని అనలిటిక్స్ ఇండియా పేర్కొంది. ఆదాయం పెంచుకోవడానికి జీపీటీ-3.5, జీపీటీ-4 వంటి పెయిడ్ సర్వీసులు ప్రారంభించింది ఓపెన్ ఏఐ. కానీ.. చాట్‌జీపీటీ ఖర్చులు భరించడానికి అవసరమైన ఆదాయం సంపాదించుకోలేకపోతున్నదని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. సొంతంగా ఏఐ ఆధారిత చాట్‌బోట్ తయారీతోపాటు చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లు.. సుమారు రూ.83 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల ఆసరాగానే ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ సేవలతోపాటు ఇతర కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. అందువల్లే ఓపెన్ ఏఐ ఇప్పటికీ మనుగడ కొనసాగిస్తున్నట్లు సమాచారం. 2023లో ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం దాదాపు రూ.1660 కోట్లు (200 మిలియన్ డాలర్లు), 2024లో 100 కోట్ల డాలర్లు అంటే రూ.8,200 కోట్లు ఉండొచ్చునని అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంచనా ఆదాయం సంపాదించుకునే సంకేతాలేమీ కనిపించడం లేదని తెలుస్తున్నది. 2022 నవంబర్‌లో ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ సేవలు ప్రారంభించింది. నాటి నుంచి గత మే వరకు కంపెనీ సుమారు రూ.4,479 కోట్ల (540 మిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. మరోవైపు చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతున్నది. జూన్‌తో పోలిస్తే జూలైలో చాట్‌జీపీటీ యూజర్లు 12 శాతం తగ్గిపోయారు. జూన్‌లో 170 కోట్ల యూజర్లు ఉంటే, జూలై నాటికి 150 కోట్ల మందికి పడిపోయారు.

ఈ-మెయిల్ రాయడం నుంచి ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కరికులం వీటే (రిజ్యూమ్) రూపకల్పన వరకూ ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇస్తుంది. మీరు తయారు చేసే వీడియో ఎలా వైరల్ చేయాలో తెలుపుతుంది. సుదీర్ఘమైన జవాబులకు బదులు స్పష్టమైన పదాలతో క్లుప్తంగా పూర్తి సమాచారం ఇస్తుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ప్రజాస్వామ్యంపై వ్యాసం ఎలా రాయాలో తెలుసుకోవాలని కోరుతున్నారనుకుందాం.. చాట్ జీపీటీపై 'ప్రజాస్వామ్యంపై వ్యాసం' కావాలని అని నమోదు చేస్తే చాలు మీ ముంగిట ప్రజాస్వామ్యంపై పూర్తి స్థాయి వ్యాసం ఉంటుంది. అన్ని రకాల ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సాధారణ జ్ఞానం లోపించి ఉంటుంది. తాను ఇచ్చే సమాధానానికి (రిఫరెన్స్) సూచనలు ఇవ్వడు. భావోద్వేగ భరిత పరిస్థితులను విశ్లేషించలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. సందర్భాన్ని అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu