ఈరోజు చంద్రయాన్-3 ముఖ్యమైన దశకు చేరుకోనుంది. ఇందులోని స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. చంద్రయాన్ ఇప్పటికే జాబిల్లి దిశగా చాలా దూరం పయనించింది అని ఈరోజు రాత్రి 7 గంటలకు దాని కక్ష్యలోకి వెళుతుందని ఇస్రో ప్రకటించింది. చంద్రుని కక్ష్యలోకి చేరిన తర్వాత అన్నీ అనుకూలిస్తే విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న మూన్ ఉపరితలం మీద దిగుతుంది. అప్పడు ఎదురయ్యే సమస్యలకు ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ తనంతట తానే సొంతంగా నిర్ణయాలు తీసుకుని అధిగమించగలదని సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రయాన్-2 కూడా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అయితే అక్కడ దిగాల్సిన ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొంది. దాంతో పని చేయకుండా పోయింది. అందుకే ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసామని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చంద్రయాన్-3 ని జూలై 14న ఎల్వీఎమ్ 3-ఎమ్4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అయిదు దశల్లో కక్ష్యను పెంచుకుంటూ పోయారు. మొత్తం 18 రోజుల వ్యవధిలోనే ఇదంతా చేశారు. అలా భూకక్ష్య పూర్తి చేసుకున్న చంద్రయాన్ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా వెళ్ళింది. ప్రస్తుతం దీని పయనం చంద్రుని దిశగా ఉంది. ఈరోజు చంద్రుని కక్ష్యలోకి కూడా ప్రవేశిస్తుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద కనుక సురక్షితంగా దిగగలిగితే...ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇండియా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం 613 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
0 Comments